
- 57 లోక్‌సభ సెగ్మెంట్లకు పోలింగ్
- 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు
- బరిలో మొత్తం 904 మంది అభ్యర్థులు
- వారణాసి నుంచి మోదీ, మండి నుంచి కంగనా పోటీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఫైనల్ ఫేజ్ ఎన్నికలు శనివారం నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తున్నది. చిట్టచివరి ఏడో దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. 8 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపి మొత్తం 57 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నది. యూపీలో 13, పంజాబ్‌లో 13, బిహార్‌లో 8, బెంగాల్లో 9, హిమాచల్‌ప్రదేశ్‌లో 4, ఒడిశాలో 6, జార్ఖండ్‌లో 3, చండీగఢ్‌లో ఒక లోక్‌సభ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
పంజాబ్ నుంచి 328 మంది, యూపీ నుంచి 144 మంది, బిహార్ నుంచి 134 మంది, ఒడిశా నుంచి 66 మంది, జార్ఖండ్ నుంచి 52 మంది, హిమాచల్‌ప్రదేశ్ నుంచి 37 మంది, చండీగడ్ నుంచి నలుగురు పోటీలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ ఉంటుంది. ఈ ఫేజ్‌లో ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి సెగ్మెంట్‌కు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మండి నుంచి బీజేపీ తరఫున కంగనా రనౌత్, కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ బరిలో ఉన్నారు.