గల్లీ గల్లీలో గులాబీ మండపాన్ని పెడదాం..

గల్లీ గల్లీలో గులాబీ మండపాన్ని పెడదాం..
  • నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి
  • మొత్తం ఖర్చులన్నీ మీరే చూసుకోండి
  • ఎన్నికల ముంగట ఇంకో పార్టీకి చాన్స్ ఇవ్వొద్దు 
  • ప్రగతి భవన్ నుంచి మానిటరింగ్ ఉంటుందన్న పార్టీ

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీల కన్నా ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారం ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. గ్రామాల నుంచి పట్టణాల దాకా అన్ని చోట్ల గణపతి మండపాలన్నీ కారు పార్టీనే పెట్టనుంది. వినాయక విగ్రహాల కొనుగోలు, మండపాల ఏర్పాటుకు విరాళాలు ఇవ్వనుంది. ఎన్నికల ముంగట ఇంకో పార్టీకి ఈ అవకాశం దక్కకుండా.. మొత్తం మండపాలన్నీ పార్టీ స్పాన్సర్​షిప్​తోనే ఏర్పాటు చేయాలని లీడర్లకు అధినాయకత్వం సూచించింది.

 పార్టీ అభ్యర్థులందరూ తమ ప్రచారానికి గణేశ్​నవరాత్రులను ఉపయోగించుకోవాలని చెప్పింది. అభ్యర్థులు, ఆయా ప్రాంతాల ముఖ్య నాయకులు తప్పనిసరిగా వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు ఏదో ఒకరోజు ఆయా ప్రాంతాల్లోని మండపాలకు వెళ్లి పూజలు చేయాలని తెలిపింది. గణపతి నవరాత్రులను ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా అధికారపార్టీ నిఘా కూడా పెట్టనుంది. ప్రగతి భవన్​ నుంచే ఎక్కడేం జరుగుతుందో మానిటరింగ్ ​చేయనుంది. 

బీఆర్ఎస్ ఇప్పటికే​115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకో నాలుగు సీట్లను మాత్రమే పెండింగ్​లో పెట్టింది. ఆ సీట్లలో పోటీ చేసే అభ్యర్థులను కూడా త్వరలో ఖరారు చేయనుంది. ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన బీఆర్ఎస్.. ఎన్నికల్లోపు వచ్చే ప్రతి పండగను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా గణేశ్​ నవరాత్రులు, దసరా, బతుకమ్మ ఉత్సవాలపై ఫోకస్​ పెట్టింది. ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫస్ట్​టాస్క్​గా వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలను టార్గెట్ పెట్టింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు ఏటా గణేశ్​నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే సంస్థలు, సంఘాలు ఉన్నాయి. 

ఆయా సంస్థలు, సంఘాలతో వెంటనే సమావేశాలు నిర్వహించి మండపంలో ప్రతిష్టించబోయే విగ్రహాన్ని తామే డొనేట్​చేస్తామని హామీ ఇవ్వాలని లీడర్లకు అధినాయకత్వం సూచించింది. మండపాల ఏర్పాటు, డెకరేషన్, తొమ్మిది రోజుల పాటు ఉత్సవాల నిర్వహణ, నిత్యాన్నదానం, ప్రసాదం, నిమజ్జనం వరకు అన్నింటిలోనూ తాము తోడుగా ఉంటామని వారికి మాట ఇవ్వాలని చెప్పింది. ఉత్సవాల నిర్వహణపై  సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని పేర్కొంది. 

ఎంత ఖర్చయినా సరే.. 

నవరాత్రి ఉత్సవాలకు ఎంత ఖర్చయినా సరే పెట్టుకోవాలని, ఇందుకు పార్టీ నాయకత్వం కూడా అండగా ఉంటుందని బీఆర్ఎస్ లీడర్లకు హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో ఏర్పాటు చేసే గణేశ్​ మండపాలకు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎమ్మెల్యే అభ్యర్థులు, గులాబీ లీడర్లు ఉత్సవాల్లో ఏ మేరకు పాల్గొంటున్నారో మానిటరింగ్ కూడా​ చేయనున్నారు. దీనికి అదనంగా ఇంటెలిజెన్స్​సహా ఇతర ఏజెన్సీల సేవలు ఉపయోగించుకోనున్నారు. ఉత్సవాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారని, ఆ సమయంలో పార్టీ లీడర్లు అక్కడ ఎక్కువగా సేవ చేస్తూ కనిపిస్తే పార్టీకి పాజిటివ్​అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. 

ఇతర పార్టీల నుంచి ఎక్కడ ఎవరు పోటీ చేస్తారో తెలలేదు కాబట్టి వారికి టికెట్లు ఇచ్చి గ్రౌండ్​లోకి వచ్చే లోపే అన్ని మండపాల్లో బీఆర్ఎస్​ విరాళాలతో వినాయక విగ్రహాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఈక్రమంలోనే పార్టీ క్యాండిడేట్లు, వారి ముఖ్య అనుచరులు రంగంలోకి దిగి వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై సంప్రదింపులు మొదలు పెట్టారు. ఈ మొత్తం ప్రక్రియ ఈ నెలాఖరులోపే పూర్తి చేసి విగ్రహాలు తెప్పించేందుకున విరాళాలు కూడా ఇవ్వనున్నట్టు ప్రగతి భవన్​సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.