
- నాలుగోసారి టైటిల్ నెగ్గి రికార్డు
- ఫైనల్లో ఇంగ్లండ్‌కు తప్పని నిరాశ
బెర్లిన్ : యూరోపియన్ ఫుట్‌బాల్‌లో తామే రారాజు అని స్పెయిన్ టీమ్ మరోసారి నిరూపించింది. యూరో ట్రోఫీని నాలుగోసారి కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. సాకర్ పుట్టినిల్లయిన ఇంగ్లండ్ ఆశలపై మరోసారి నీళ్లు కుమ్మరించింది. దశాబ్దాలుగా యూరో టైటిల్ కోసం పోరాడుతున్న ఇంగ్లిష్ టీమ్ ఈసారి కూడా తన కలను నెరవేర్చుకోలేకపోయింది. మెగా టోర్నీలో ఆరంభం నుంచి చివరి వరకు అద్భుత ఆటతో కట్టిపడేసిన స్పెయిన్ ఆదివారం అర్ధరాత్రి జరిగిన మెగా ఫైనల్లో 2–1తో ఇంగ్లండ్‌ను ఓడించింది.
అత్యంత హోరాహోరీగా సాగిన టైటిల్ ఫైట్ చివర్లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి 86వ నిమిషంలో స్పెయిన్‌కు విన్నింగ్ గోల్ అందించిన మైకేల్ ఒయర్జాబల్ మ్యాచ్ విన్నర్‌గా మారిపోయాడు. నికో విలియమ్స్ (47వ నిమిషం) స్పెయిన్‌కు తొలి గోల్ అందించగా.. కోల్ పాల్మెర్ (73వ ని) ఇంగ్లండ్ ఏకైక గోల్ కొట్టాడు. మెగా టోర్నీలో నాలుగు టైటిల్స్ నెగ్గిన స్పెయిన్ ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా జర్మనీ (3సార్లు) రికార్డు బ్రేక్ చేసింది. ఇది వరకు1964, 2008, 2012లోనూ టైటిల్స్ నెగ్గింది. ఈ టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన స్పెయిన్..
ఓ ఎడిషన్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా మరో రికార్డు సొంతం చేసుకుంది. నికో విలియమ్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవగా.. 17 ఏండ్ల స్పెయిన్ యంగ్ సెన్సేషన్ లమినె యమల్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు సొంతం చేసుకున్నాడు. రోడ్రికి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు దక్కగా.. గోల్డెన్ బూట్ అవార్డును ఆరుగురు ప్లేయర్లకు పంచారు.
జోర్‌దార్ స్పెయిన్
ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి ఇంగ్లండ్ సేఫ్ గేమ్ ఆడింది. స్పెయిన్ టీమ్ బంతిని ఎక్కువగా తమ నియంత్రణలో ఉంచుకొని ఆధిపత్యం చెలాయించినా మొదట్లో ఇంగ్లండ్ డిఫెన్స్‌ను దాటలేకపోయింది. దాంతో ఫస్టాఫ్‌లో ఇరు జట్లకు గోల్ చేసే అవకాశాలు పెద్దగా లభించలేదు. స్పెయిన్ ఆటగాడు నికో విలియమ్స్ ప్రయత్నాన్ని జాన్ స్టోన్స్ అడ్డుకోగా.. ఫస్టాఫ్ చివర్లో ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ ఫోడెన్ టైట్ యాంగిల్ నుంచి కొట్టిన షాట్‌ను స్పెయిన్ గోల్ కీపర్ యునై సైమన్ బ్లాక్ చేశాడు. అయితే, సెకండాఫ్ లో స్పానిష్ టీమ్ జోరు పెంచింది.
బ్రేక్ నుంచి వచ్చిన 69 సెకండ్లలోనే గోల్ కొట్టి ఆధిక్యంలోకి వచ్చింది. కర్వాజల్ తొలుత లామిన్ యమల్‌కు తర్వాత విలియమ్స్‌కు పాస్ ఇచ్చాడు. ఇంగ్లండ్ గోల్‌కీపర్ జోర్డాన్ పిక్‌ఫోర్డ్ ఏమారుస్తూ విలియమ్స్ పర్‌ఫెక్ట్ ప్లేస్ షాట్‌తో బాల్‌ను నెట్‌లోకి పంపించాడు. ఇక్కడి నుంచి స్పెయిన్ జట్టు మరికొన్ని గోల్స్ అవకాశాలు సృష్టించుకుంటూ ముందుకెళ్లింది. కోల్ పాల్మెర్, ఆలీ వాట్కిన్స్ సబ్‌స్టిట్యూట్స్‌గా గ్రౌండ్‌లోకి వచ్చిన తర్వాత ఇంగ్లండ్ సైతం దీటుగా స్పందించింది. ఈ క్రమంలో పాల్మెర్ 73వ నిమిషంలో లెఫ్ట్ కార్నర్‌లో 21 మీటర్ల దూరం నుంచి బంతిని నెట్‌లోకి కొట్టి గోల్ చేశాడు.
అయితే, 1–1తో స్కోరు సమం చేసిన తర్వాత కూడా ఇంగ్లండ్ అనూహ్యంగా వెనుకంజ వేసింది బంతిని తిరిగి తమ కంట్రోల్‌లోకి తీసుకున్న స్పెయిన్ మంచి పాస్‌లతో అవకాశాలు సృష్టించుకుంది. 82వ నిమిషంలో స్పెయిన్ యంగ్‌స్టర్ యమల్ ప్రయత్నాన్ని పిక్‌ఫోర్డ్ అడ్డుకున్నాడు. కానీ, నాలుగు నిమిషాల తర్వాత కుకురెల్లా తక్కువ ఎత్తుల్లో నుంచి పంపిన పాస్‌ను బాక్స్‌లో అందుకున్న ఒయర్జాబల్ విన్నింగ్ గోల్ కొడుతుంటే పిక్‌ఫోర్ట్ నిస్సహాయంగా మిగిలిపోయాడు. తర్వాత ఇంగ్లండ్ స్కోరు సమం చేసేందుకు చేసిన ప్రయత్నాలను స్పానిష్ టీమ్ డిఫెండర్లు నిలువరించారు.
ప్రైజ్‌మనీ స్పెయిన్ రూ. 256.84 కోట్లు
ఇంగ్లండ్ రూ. 220.48 కోట్లు