- అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
- రూ.30 లక్షల ఖర్చుతో భారీ సెక్రటేరియెట్ సెట్టింగ్ వేయించిన ఎమ్మెల్యే నన్నపనేని
- ‘మొక్కలు నాటండి, పండ్లు పంచండి’ అంటూ డీహెచ్ సర్క్యులర్
హైదరాబాద్, వెలుగు:సీఎం కేసీఆర్ బర్త్ డే వేళ ఆయన్ను ఇంప్రెస్ చేసే పనిలో గులాబీ నేతలు నిమగ్నమయ్యారు. అట్టహాసంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎలక్షన్ ఇయర్ కావడంతో సార్ నజర్లో పడాలని మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీలు పడుతున్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే.. ఏకంగా సెక్రటేరియెట్‌ను పోలిన సెట్టింగ్ పెట్టించారు. మరోవైపు గులాబీ లీడర్లకన్నా తానేం తక్కువ కాదని పబ్లిక్‌హెల్త్ డైరెక్టర్శ్రీనివాస్రావు చాటుకున్నారు. ఓ సర్క్యులర్ రిలీజ్ చేసిన ఆయన.. సీఎం బర్త్ డే సందర్భంగా అన్ని హాస్పిటళ్లు, పీహెచ్‌సీల ఆవరణలో మొక్కలు నాటాలని, రోగులకు పండ్లు పంపిణీ చేయాలని డాక్టర్లు, సిబ్బందిని ఆదేశించారు.
ఒకరిని మించి ఒకరు
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ రూ.30 లక్షల ఖర్చుతో ఆజంజాహీ మిల్స్ఆవరణలో సెక్రటేరియెట్‌ను పోలిన భారీ సెట్టింగ్ వేయించారు. సెట్టింగ్ లోపల డబుల్బెడ్రూం ఇండ్లు సహా తెలంగాణ ప్రభుత్వ పథకాలన్నీ వివరిస్తూ నమూనాలు ప్రదర్శించారు. మూడు రోజుల పాటు అట్టహాసంగా బర్త్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. నెక్లెస్‌రోడ్డులోని థ్రిల్సిటీలో భారీ ఎత్తున కేసీఆర్ బర్త్‌డే వేడుకలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ఎమ్మెల్యే దానం నాగేందర్ఆధ్వర్యంలో కళ్లు చెదిరేలా వేడుకలు నిర్వహించబోతున్నారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంగారు పట్టుచీర సమర్పించనున్నారు. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లలో ప్రత్యేక పూజలు, కేక్కట్టింగులు, వృద్ధ, అనాథ ఆశ్రమాలతోపాటు ఇతర ప్రాంతాల్లో అన్నదానాలు, హాస్పిటళ్లలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ, పేదలకు చీరలు, దుస్తులు పంపిణీ చేయబోతున్నారు. నగరం మొత్తం కేసీఆర్ బర్త్‌డే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
యాగాలు, పూజలు
రాష్ట్రంలోని 5 వేల దేవాలయాల్లో కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేక పూజలు చేయనున్నారు. హైదరాబాద్‌లోని పలు ఆలయాల్లో చండీయాగం, రాజశ్యామల యాగం, ఆయుష్ హోమం సహా ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో 25 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో పల్లీలు, ఉల్వలు, ఉప్పు, ఇతర రంగులతో కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించారు. మంత్రి హరీశ్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీ నిర్వహించారు. క్రికెటర్ అంబటి రాయుడు, హీరో నాని ఈ టోర్నీలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్, చెస్, వాలీబాల్ సహా అనేక టోర్నీలు ఏర్పాటు చేశారు. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి బ్రెయిలీ లిపిలో కేసీఆర్ జీవిత చరిత్ర పుస్తకం రూపొందించారు. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్.. సికింద్రాబాద్ వెస్లీ కాలేజీ ఆవరణలో దళిత క్రైస్తవ సమ్మేళనం నిర్వహించారు. పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్దామోదర గుప్త.. హైదరాబాద్, రామగుండంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భారత్‌జాగృతి ఆధ్వర్యంలో పురు షుల, మహిళల రాష్ట్ర స్థాయి వాలీబాల్‌పోటీలు నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.. ఆరు జంటలకు పెండ్లి జరిపించారు.
సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో గురువారం సిడ్నీ, అడిలైడ్, మెల్‌బోర్న్, కాన్ బెర్రా, బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్, బెండిగో, బల్లారాట్ నగరాల్లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, నాయకులు వినయ్ సన్నిగౌడ్, సాయికృష్ణ కల్వకుంట్ల, సాయిరాం, విశ్వామిత్ర, సతీశ్, సంతోష్ పాల్గొన్నారు.
సార్ బర్త్ డే చేయండి: డీహెచ్ ఆర్డర్
సీఎం బర్త్ డే సందర్భంగా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన సర్క్యులర్ వివాదాస్పదమైంది. కేసీఆర్ పుట్టిన రోజున రాష్ట్రంలోని అన్ని హాస్పిటళ్ల ఆవరణల్లో మొక్కలు నాటాలని, రోగులకు పండ్లు పంచాలని అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. గతంలోనూ ఈయన వ్యవహారశైలి వివాదాలకు దారి తీసింది. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే ఆలోచనతోనే డీహెచ్ ఇలా ఆదేశాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.