వంగూరు, వెలుగు : రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. తమ ఊరికి చెందిన వ్యక్తి రాష్ట్ర సీఎం కావడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను కొత్త సీఎం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని వంగూరు మండలం ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రమాణ స్వీకారానికి కదిలిన వంగూరు
హైదరాబాద్, ఎల్బీ స్టేడియంలో జరిగిన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వంగూరు మండల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కొండారెడ్డిపల్లి డిప్యూటీ సర్పంచ్ ఎనుముల వేమారెడ్డి మాట్లాడుతూ..రేవంత్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం మండల, గ్రామ ప్రజలకు ఆనందం, సంతోషాన్ని కలగజేసిందన్నారు.