తొలి విడతలో  రూ.810 కోట్ల రుణమాఫీ

తొలి విడతలో  రూ.810 కోట్ల రుణమాఫీ
  • ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,53,266  మంది రైతులకు రుణ విముక్తి 

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు:  రేవంత్​రెడ్డి సర్కార్​ రైతులు తీసుకున్న లోన్​ మొత్తం ఒకేసారి మాఫీ చేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లక్షలోపు క్రాప్​ లోన్లను గురువారం మాఫీ చేయడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల్లో సంబరాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులతో కలిసి ర్యాలీలు నిర్వహించారు. పలుచోట్ల సీఎం ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. మొదటి విడతలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా లక్ష లోపు రుణాలు తీసుకున్న1,53,166 మంది రైతులకు రూ.810  కోట్లు మాఫీ అయ్యాయి.     

మెదక్​ జిల్లాలో..

మెదక్ జిల్లాలో మొదటి విడతలో 48,864 మంది రైతులకు సంబంధించి రూ.241 కోట్లు మాఫీ అయ్యాయి. మండలాలు, గ్రామాల వారీగా లోన్​ మాఫీ అయిన రైతుల పేర్ల జాబితా విడుదలైంది. రుణమాఫీ సందర్భంగా నర్సాపూర్​లో మాజీ ఎమ్మెల్యే మదన్​రెడ్డి, కాంగ్రెస్​నియోజకవర్గ ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​ఆంజనేయులు రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పెద్దశంకరంపేటలో జరిగిన సంబరాల్లో నారాయణఖేడ్​ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొనగా, కౌడిపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్​రాహుల్​రాజ్, డీఏవో గోవింద్ పాల్గొన్నారు. మెదక్​ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు సురేందర్ గౌడ్​, రాజేశ్, పవన్, హఫీజ్, శ్రీనివాస్ చౌదరి, శంకర్​, ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు. 

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో మొదటి విడతలో 53,138 మంది రైతులకు సంబంధించి రూ.290 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. అత్యధిక మొత్తంలో రుణ మాఫీ జరిగిన నియోజకవర్గాల్లో హుస్నాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గంలో 18,101 మంది రైతులకు రూ.106.74 కోట్ల రుణ మాఫీ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. పట్టణ, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకాలు నిర్వహించి బైక్ ర్యాలీలు తీశారు. 

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో మొదటి విడతలో 51,164 మంది రైతులు రూ.279.62 కోట్ల లబ్ధి పొందారు. ఐదు నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 26 మండలాల్లో ఈ పథకం అమలు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 7,528 మంది రైతులు కాగా, జహీరాబాద్ సెగ్మెంట్​లో 9,412 మంది, ఆందోల్ లో 14,261 మంది రైతులు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో 14,733 మంది, పటాన్ చెరు సెగ్మెంట్ లో 2,843 మంది, హత్నూర మండలంలో 2,317 మంది రైతులు రుణమాఫీ పొందారు. జిన్నారం మండలంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్ సంజీవరెడ్డి, జూకల్, నారాయణఖేడ్, కొండాపూర్ మండలంలో టీజీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.

డాకూర్ లో మంత్రి దామోదర

ఆందోల్ నియోజకవర్గం డాకూర్ లో హెల్త్ మినిస్టర్​దామోదర రాజనర్సింహ రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. డాకూర్ రైతు వేదికలో కలెక్టర్ క్రాంతి వల్లూరు సమక్షంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు రుణమాఫీ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాకు సంబంధించిన రుణమాఫీ వివరాలను మంత్రి వివరించారు. ఆ తర్వాత రైతులు శివయ్య, లచ్చవ్వతో సీఎం మాట్లాడి రుణమాఫీ చేయడం పట్ల వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అందుకు వారు సంతోషంగా ఉన్నామని బదులిచ్చారు.