అద్భుతమైన క్షణం.. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ : చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్ 3 విజయంతో దేశమంతా గర్విస్తున్నదని, ఇది అద్భుతమైన క్షణమని ఆమె పేర్కొన్నారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండయ్యే కార్యక్రమాన్ని ఆమె లైవ్ లో వీక్షించారు. మిషన్ విజయవంతమైన తర్వాత సైంటిస్టుల తో పాటు మిషన్ లో పాలుపంచుకున్న ప్రతిఒక్కరికీ ఆమె అభినందనలు తెలిపారు. ‘‘చంద్రయాన్ 3 విజయంతో మన ఇస్రో సైంటిస్టులు చరిత్ర సృష్టించారు. ఇది నిజంగా అద్భుతమైన, గర్వించదగ్గ క్షణం. జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుంది. మన సైంటిస్టులు దేశాన్ని గర్వించేలా చేశారు. చంద్రయాన్ 3లో పాలుపంచుకున్న అందరికీ నా అభినందనలు” అని ముర్ము ఆ వీడియోలో పేర్కొన్నారు.
కంగ్రాట్స్.. ఇండియా : నాసా చీఫ్ బిల్ నెల్సన్
వాషింగ్టన్: చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ కావడంతో నాసా చీఫ్ బిల్ నెల్సన్ ఇండియాతో పాటు ఇస్రో సైంటిస్ట్లకు కంగ్రాట్స్ చెప్పారు. స్పేస్ క్రాఫ్ట్‌ను చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ చేసిన నాల్గో దేశంగా ఇండియా నిలిచిందని కొనియాడారు. ఈ మిషన్‌లో యూఎస్ స్పేస్ ఏజెన్సీ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. సౌత్‌పోల్‌లో సేఫ్ ల్యాండింగ్ చేశారని వివరించారు. ఇండియాకు తమ సహాయ సహకారాలు ఉంటాయని ప్రకటించారు. కాగా, చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ కావడంపై యూఎస్ నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ జేక్ సులివియన్ ఇండియా, ఇస్రో సైంటిస్టులకు అభినందనలు తెలిపారు. మున్ముందు మరిన్ని ప్రాజెక్టుల్లో ఇండియాతో నాసా కలిసి పని చేస్తుందని అన్నారు.
ఎన్నో ఏండ్ల కష్టమిది: రాహుల్ గాంధీ
చంద్రయాన్ 3 సక్సెస్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ అయిన తర్వాత ఇస్రో సైంటిస్టులకు ఆయన అభినందనలు తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టాలన్న కల ఎన్నో ఏండ్లుగా ఉందని, ఇస్రో సైంటిస్టులు ఎంతో కష్టపడి ఈ ఘనత సాధించారని ఆయన ట్వీట్ చేశారు. 1962 నుంచి ఇండియా స్పేస్ ప్రోగ్రాం ఎన్నో మైలురాళ్లు సాధించిందని, అంతరిక్ష రంగంపై యువతలో స్పూర్తి నింపిందని రాహుల్ వ్యాఖ్యానించారు.
కాగా, మన దేశ అంతరిక్ష ప్రయాణం 1962 ఫిబ్రవరి 23న ప్రారంభమైంది. అప్పట్లోనే నెహ్రూ మద్దతుతో సెంటిస్టులు హోమీ భాభా, విక్రమ్ సారాభాయ్‌లు ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.
హాలీవుడ్ సినిమా కంటే తక్కువ బడ్జెట్: ఎలాన్ మస్క్
చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి న్యూస్ థింక్ అనే ట్విటర్ అకౌంట్ ఒక పోస్ట్ పెట్టింది. చంద్రయాన్ 3 బడ్జెట్, హాలీవుడ్ సినిమా ఇంటర్ స్టెల్లార్ బడ్జెట్‌ను పోల్చుతూ ఆ ట్వీట్ ఉంది. హాలీవుడ్ సినిమా ఇంటర్ స్టెల్లార్ బడ్జెట్ దాదాపు రూ.1,365 కోట్లు కాగా.. కేవలం రూ.620 కోట్లతోనే ఇస్రో చంద్రయాన్ 3ని ప్రయోగించిందని ఆ ట్వీట్ సారాంశం. ‘చంద్రయాన్ 3 బడ్జెట్.. ఇంటర్ స్టెల్లార్ బడ్జెట్ కంటే తక్కువ అని తెలిసినప్పుడు మీకు తప్పకుండా ఆశ్చర్యం కలుగుతుంది’’ అని న్యూస్ థింక్ ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్‌కు ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ‘గుడ్ ఫర్ ఇండియా’ అని ట్వీట్ చేశారు. చంద్రయాన్ 3 ప్రయోగంపై ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ చూసిన నెటిజన్లు ఆయనకు థ్యాంక్స్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.
మానవాళికే చరిత్రాత్మకం: పాక్ మాజీ మంత్రి ఫవాద్
ఇండియాకు చెందిన చంద్రయాన్-3 మిషన్ మానవజాతికి చారిత్రాత్మక ఘట్టమని పాకిస్తాన్ సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి అభివర్ణించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్విట్ చేశారు. "బుధవారం సాయంత్రం 6:15 గంటలకు జరగనున్న చంద్రయాన్ మూన్ ల్యాండింగ్‌ను పాక్ మీడియా కూడా ప్రత్యక్ష ప్రసారం చేయాలి. ఈ ప్రయోగం ద్వారా వెలువడే ఫలితం ఇండియా ప్రజలకు, సెంటిస్టులతో పాటు విశ్వ మానవ జాతికి చరిత్రాత్మక క్షణంగా మారనుంది. ఇంత అద్భుతమైన ప్రయోగాన్ని చేపట్టిన స్పేస్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియాకు కంగ్రాట్స్" అని ఫవాద్ చౌదరి పేర్కొన్నారు.