ఫిబ్రవరి 14, 15న ఉప్పల్ ​స్టేడియంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్

ఫిబ్రవరి 14, 15న ఉప్పల్ ​స్టేడియంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్
  • ఒకే టికెట్​ రెండు మ్యాచ్​లు చూసే అవకాశం
  • భోజ్​పురి, చెన్నై టీమ్స్​తో తలపడనున్న తెలుగు హీరోస్​
  • స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన రాచకొండ సీపీ

ఉప్పల్, వెలుగు: సెలబ్రిటీ క్రికెట్ లీగ్–2025లో భాగంగా ఈ నెల 14, 15 తేదీల్లో ఉప్పల్​ రాజీవ్ ​గాంధీ క్రికెట్ స్టేడియంలో నాలుగు మ్యాచ్​లు నిర్వహిస్తున్నారు. ఇందులో రెండు తెలుగు సినీ హీరోల మ్యాచ్​లు ఉన్నాయి. 14న మధ్యాహ్నం 2 గంటలకు చెన్నై రినోస్​వర్సెస్​కర్నాటక బుల్డోజర్స్, సాయంత్రం 6.30కు తెలుగు వారియర్స్​వర్సెస్​భోజ్​పురి దబాంగ్స్​మ్యాచ్​లు జరగనున్నాయి.15న మధ్యాహ్నం 2 గంటలకు ముంబై హీరోస్ వర్సెస్​కర్ణాటక బుల్డోజర్స్, సాయంత్రం 6.30కు​తెలుగు వారియర్స్ వర్సెస్​చెన్నై రినోస్ మ్యాచ్​లు ఉంటాయి. 

బుక్​మై షో యాప్​లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్​పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీపీ సుధీర్​బాబు బుధవారం ఉప్పల్​స్టేడియంలో స్టేడియం, జీహెచ్ఎంసీ, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు, సీసీఎల్​నిర్వాహకులతో కోఆర్డినేషన్​మీటింగ్​నిర్వహించారు. సెలబ్రిటీల టీ20 మ్యాచ్​లకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయం ముఖ్యమన్నారను. నిబంధనల ప్రకారమే కూల్ డ్రింక్స్, ఫుడ్​ఐటమ్స్​విక్రయించాలని, స్టేడియం పరిసరాల్లో సీసీ కెమెరాలన్నీ పనిచేసేలా చూడాలన్నారు. 

అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మీడియా ప్రతినిధులకు, ఇతరులకు ఇచ్చే పాసుల జారీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, సీసీఎల్​ మ్యాచ్​ల కోసం సిటీకి వచ్చిన  కన్నడ సూపర్​ స్టార్, కర్ణాటక బుల్డోజర్స్​ టీమ్​ కెప్టెన్​ కిచ్చా సుదీప్​ తన టీమ్​ మేట్స్​తో  కలిసి బుధవారం సాయంత్రం మెట్రోలో జర్నీ చేశారు.