అక్కాచెల్లి మధ్య సెల్​ఫోన్​ లొల్లి.. చెల్లె సూసైడ్

దుబ్బాక, వెలుగు : అక్కాచెల్లెళ్ల మధ్య సెల్ ఫోన్  గొడవ చెల్లెలి ప్రాణం తీసింది. మెదక్​జిల్లా దుబ్బాకకు చెందిన మార్గాల వసంత, శంకర్​దంపతులకు ముగ్గురు కూతుర్లు. పెద్ద కూతురు నదియాకు పెండ్లికాగా.. రెండో కూతురు నందిని, డిగ్రీ చదువుతున్న మూడో కూతురు (21) నవిత ఇంట్లో ఉంటున్నారు. గత నెల 30న నందిని, నవితకు సెల్​ఫోన్​ విషయంలో గొడవ జరిగింది. దీంతో తల్లిదండ్రులు ఫోన్​ను బీరువాలో వేసి కూలిపనికి వెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన నవిత పురుగులమందు తాగింది. 

అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను చుట్టుపక్కల వారు గమనించి శంకర్ కు ఫోన్​లో సమాచారం అందించారు. అనంతరం నవితను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నవిత పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవిత శుక్రవారం చనిపోయిందని ఎస్ఐ గంగరాజు తెలిపారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.