ఓయూ, వెలుగు : జల్సాలకు అలవాటుపడి సెల్ ఫోన్లు, బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను హైదరాబాద్, ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు వారి వద్ద నుంచి 22 సెల్ ఫోన్లు, నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన ముఠాల్లో లవ్ మ్యారేజీ చేసుకున్న జంట కూడా ఉంది.
కేసుపై ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావు మాట్లాడుతూ.." ఛత్రినాక గౌలిపురాకు చెందిన పాత నేరస్తుడు కంసాల అరుణ్ కుమార్(23), అతని భార్య స్నేహ(లవ్ మ్యారేజీ) (20), పనుగంటి రఘుబాబు (20), మరో మైనర్ తో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. అలాగే..మల్కాజిగిరి వసంతపురి కాలనీకి చెందిన మూస సుమన్ (19), మల్తుంకార్ మధు (19), కాణిపాక ప్రశాంత్ (21)తో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు.
ఈ రెండు ముఠాల సభ్యులు ఓయూ ఏరియాలో గత కొన్నేండ్లుగా చైన్ స్నాచింగ్, ఫోన్లు, బైకులను చోరీ చేస్తున్నారు. రాత్రి వేళ ఫుట్ పాత్ ల మీద పడుకున్న వారిని, ఒంటరిగా వెళుతున్న వారిని టార్గెట్ చేసి నేరాలకు పాల్పడుతున్నారు. దొంగిలించిన వస్తువులను సికింద్రాబాద్ కు చెందిన మహమ్మద్ ఉరఫ్ చిచ్చా (65), అఫ్రొజ్(44), షేక్ అలీ (39), వి.రాజు(23)లకు రూ.2వేల నుంచి రూ.3వేలకు విక్రయిస్తున్నారు. వరుస చోరీలపై బాధితులు ఓయూ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టాం" అని డీసీపీ వివరించారు.
ఎలా చిక్కారంటే..
ఓయూలో చోరీలపై ఫిర్యాదులు అందడంతో నిందితులను పట్టుకోడానికి నలుగురితో ఒక టీమ్ ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. "శుక్రవారం రాత్రి తార్నాక సీతాఫల్మండి బ్రిడ్జీ ఏరియాలోని ఫుట్‌పాత్‌పై ఓ కానిస్టేబుల్‌ను పడుకోబెట్టి మిగతా వారు చీకట్లో మాటు వేశారు. కాసేపటికే అరుణ్కుమార్తన భార్య స్నేహ, మరో బాలుడితో కలిసి బైక్‌పై వచ్చారు. ఫుట్‌పాత్‌పై పడుకున్న కానిస్టేబుల్వద్దకు వెళ్లి అతని జేబులోని సెల్‌ఫోన్‌ను లాక్కొని బైక్‌పై పరారవడానికి ప్రయత్నించారు. కానీ..ముందస్తు పథకంలో భాగంగా అప్పటికే మాటు వేసిన పోలీసులు వారిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. అలాగే.. తార్నాక ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి పక్కన ఓ బాలుడితోపాటు మరో యువకుడు నిలబడి ఉండటాన్ని గమనించిన పోలీసులు వారి వైపు వెళ్లారు. దాంతో వారు భయపడి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంబడించి ఇద్దరిని పట్టుకున్నారు. వారందరిని విచారించి గతంలో ఎక్కడెక్కడ చోరీలు చేశారనే వివరాలను రాబట్టారు. రెండు గ్యాంగ్ ల నుంచి సెల్ ఫోన్లు, బైకులను స్వాధీనం చేసుకున్నాం. నిందితులను రిమాండ్ కు తరలించాం" అని గిరిధర్ రావు వివరించారు.
పిల్లల కదలికలపై పేరెంట్స్ దృష్టిపెట్టాలి: డీసీపీ గిరిధర్
పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘాపెట్టకపోవడంతో వారు చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. డబ్బుకోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిందితుల్లో పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ వరకు చదువుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా పిల్లల కదలికలను ఓ కంట కనిపెడుతూ ఉంటాలి.