జనవరి నుంచి దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు

జనవరి నుంచి దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు
  • 2026లో డేటా విడుదల
  • కులగణనపై నో క్లారిటీ.. మారనున్న సెన్సస్ సైకిల్
  • అదే నెలలోనే నేషనల్  పాపులేషన్ రిజస్టర్  అప్ డేట్  

వచ్చే జనవరిలో దేశవ్యాప్తంగా జనగణన (సెన్సస్) ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. పదేండ్లకు ఒకసారి జనాభా లెక్కలు తీయాలని ఉండగా.. కరోనా కారణంగా 2021లో కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదు. అప్పుడు వాయిదా పడ్డ జనగణన వచ్చే జనవరిలో మొదలయ్యే అవకాశం ఉంది.  దీంతో ఇకపై సెన్సస్ సైకిల్ 2025, 2035, 2045.. గా మారనుంది. జనగణనతోపాటు కులగణన కూడా చేపట్టాలని డిమాండ్లు వ్యక్తమవుతుండగా కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా, జనాభా లెక్కల కోసం వచ్చే సిబ్బంది ప్రతి కుటుంబాన్ని మొత్తం 31 ప్రశ్నలు అడుగుతారని సమాచారం.

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జనవరి నుంచి జనాభా లెక్కలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నేషనల్  పాపులేషన్  రిజిస్టర్ (ఎన్పీఆర్) ను అప్ డేట్  చేసే ప్రక్రియ కూడా అదే నెలలో ప్రారంభించే చాన్స్  ఉందని అధికార వర్గాలు తెలిపాయి. జనగణన, ఎన్పీఆర్  డేటాను 2026లో విడుదల చేయవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి, పదేండ్లకు ఒకసారి జనగణన నిర్వహిస్తారు. కరోనా కారణంగా 2021లో జనగణన చేపట్టలేదు. ఈసారి 2025లో జనాభా లెక్కింపు చేపట్టిన నేపథ్యంలో సెన్సస్  సైకిల్  మారనుంది.

2025లో జనగణన తర్వాత 2035, 2045 నుంచి ప్రకారం జనాభాను లెక్కించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, కులగణన విషయంలో కేంద్రంఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు. దేశంలో ఓబీసీల జనాభా ఎంత ఉందో తెలియాలంటే కులగణన నిర్వహించాల్సిందే అని కాంగ్రెస్, ఆర్జేడీ వంటి ప్రతిపక్షాలు డిమాండ్  చేస్తున్నాయి.

అడిగేవి ఈ ప్రశ్నలే

.జనగణన సమయంలో అధికారులు మొత్తం 31 ప్రశ్నలు అడుగుతారు. కుటుంబంలో ఎంత మంది నివసిస్తున్నారు, కుటుంబ పెద్ద పురుషుడా, మహిళనా, ఇంట్లో మొత్తం ఎన్ని గదులు ఉన్నాయి, కుటుంబంలో ఎంత మందికి పెండ్లయింది, ఇంట్లో ఫోన్, ఇంటర్ నెట్  కనెక్షన్  ఉందా, మొబైల్  లేదా స్మార్ట్ ఫోన్, సైకిల్, టూవీలర్, ఫోర్  వీలర్లు ఉన్నాయా అని ప్రశ్నలు అడుగుతారు.

అలాగే, ఏం తింటారు, తాగునీటి వనరులు, కరెంటు, ఎలాంటి టాయిలెట్  వాడుతున్నారు, స్నానం చేయడానికి ఉన్న సౌకర్యాలు ఏంటి, వంట చేయడానికి ఎల్పీజీ కనెక్షనా లేక పీఎన్జీ కనెక్షన్  వాడుతున్నారా, రేడియా, టీవీలు ఉన్నాయా వంటి ప్రశ్నలు కూడా అడుగుతారు.