
- రూ.1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం
- ఏపీ, తమిళనాడులో 104 కిలోమీటర్ల మేర పనులు
- కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- కమాండ్ ఏరియా డెవలప్మెంట్కు రూ. 1600 కోట్లు
- పంజాబ్, హర్యానాలో రూ.1,878 కోట్లతో జిరాక్‌పూర్ బైపాస్ రోడ్డుకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించింది. తిరుపతి–-పాకాల-–కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పీఎంకేఎస్‌వై) సబ్‌స్కీమ్ అయిన కమండ్ ఏరియా కంట్రోల్ డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ (ఎంసీఏడీడబ్ల్యూఎం) ఆధునీకరణను ఆమోదించింది. దీంతోపాటు పంజాబ్, హర్యానాలో భారీ బైపాస్ రోడ్డుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. రూ.1,332 కోట్లతో తిరుపతి-–పాకాల-–కాట్పాడి డబ్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ పనులతో జంక్షన్ విస్తరిస్తున్న ఏపీతోపాటు తమిళనాడులోనూ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
ఈ మార్గంలోనే తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాక వినాయక టెంపుల్, చంద్రగిరి కోట వంటి దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి టూరిస్టులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, ఈ ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయన్నారు. తిరుపతి, వెల్లూరు ప్రాంతాల మధ్య వైద్య, విద్య హబ్‌లు ఉన్నాయని, వీటికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. రాయలసీమ రీజియన్‌కు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ డబ్లింగ్ వల్ల సుమారు 400 గ్రామాలు, 14 లక్షల జనాభాకు మెరుగైన రైలు కనెక్టివిటీ లభిస్తుందని చెప్పారు. కాగా, ఈ డబ్లింగ్ పనులతో 35 లక్షల పనిదినాలు కల్పించే అవకాశం ఉందని తెలిపారు. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు అవకాశం ఉంటుందని చెప్పారు.
ఎంసీఏడీడబ్ల్యూఎం ఆధునీకరణకు రూ. 1,600 కోట్లు
ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన (పీఎంకేఎస్‌వై) సబ్ స్కీమ్అయిన కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్ మెంట్ (ఎంసీఏడీడబ్ల్యూఎం) ఆధునీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025–-26 సంవత్సరానికి గాను కమాండ్ ఏరియా అభివృద్ధికి కేంద్రం రూ.1600 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ స్కీమ్ కింద ఆధునిక సాంకేతికతలైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్సిస్టమ్ (జీఐఎస్) ఉపయోగించి నీటిపారుదల వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది.
పంజాబ్, హర్యానాలో భారీ బైపాస్ రోడ్డు..
పంజాబ్, హర్యానాలో రూ.1,878.31 కోట్లతో నిర్మించనున్న 19.2 కిలో మీటర్ల జిరాక్‌పూర్ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఆరు లేన్ల జిరాక్‌పూర్ బైపాస్ ఎన్‌హెచ్-7 (జిరాక్‌పూర్–-పాటియాలా) జంక్షన్ నుంచి ప్రారంభమై ఎన్‌హెచ్-5 (జిరాక్‌పూర్–-పర్వానూ) జంక్షన్ వద్ద ముగుస్తుంది. జిరాక్‌పూర్, పంచకుల పరిసర ప్రాంతాల్లో పాటియాలా, ఢిల్లీ, మొహాలి ఎరోసిటీ నుంచి ట్రాఫిక్‌ను మళ్లించడం, హిమాచల్ ప్రదేశ్‌కు ప్రత్యక్ష కనెక్టివిటీని అందించడం ద్వారా రద్దీని తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక ఉద్దేశం.