జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు వీరే

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన వారి జాబితాను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం 44 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. వీరిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు చెరో ఇద్దరు చొప్పున నలుగురికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. విద్యారంగంలో విశేష సేవలకు గాను ఏటా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉత్తమ సేవలను అందిస్తున్న వారిని గుర్తించి ఉపాధ్యాయ అవార్డుతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. ఈ అవార్డు కింద ఎంపికైన ఉపాధ్యాయులకు పురస్కారం సర్టిఫికెట్ తో పాటు రూ.25వేల నగదును ప్రోత్సాహక బహుమతిగా అందజేస్తారు. 
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. సిద్దిపేట ఇందిరానగర్ జ్పీ హైస్కూలులో హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న రామస్వామి,  అసిఫాబాద్ జిల్లా సావర్ ఖేడ్ ప్రధానోపాధ్యాయుడు రంగయ్య జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విశాఖపట్టణం జిల్లా లింగరాజుపాలెం హైస్కూల్‌ ఉపాధ్యాయుడు భూషణ్ శ్రీధర్, చిత్తూరు జిల్లా ఎం.పాయిపల్లి ఐరాల హైస్కూల్‌ ఉపాధ్యాయుడు మునిరెడ్డి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 
జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యాశాఖ మంత్రులు తదితరులు అభినందించారు. కరోనా పరిస్థితుల్లోనూ విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు కట్టుబడి అందరికీ మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు.