అబీర్‌‌ గులాల్‌ సినిమాపై కేంద్రం నిషేధం.. అంతగా మూవీలో ఏముంది..?

అబీర్‌‌ గులాల్‌ సినిమాపై కేంద్రం నిషేధం.. అంతగా మూవీలో ఏముంది..?

పాకిస్తాన్‌ నటుడు ఫవాధ్​ఖాన్‌ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘అబీర్‌‌ గులాల్‌’. వాణీ కపూర్ హీరోయిన్. మే 9న సినిమా విడుదల కావల్సి ఉంది.  అయితే  జమ్మూ కాశ్మీర్‌‌లోని పహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్‌ నేపథ్యంలో ఈ సినిమాను మన దేశంలో బ్యాన్‌ చేయాలని కేంద్ర సమాచార శాఖ నిర్ణయించినట్టు సమాచారం. అలాగే ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన పలు యూనియన్స్‌ ఈ సినిమాను బ్యాన్‌ చేయాలని పిలుపునిచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్ ఓనర్స్‌ కూడా ఈ సినిమా ప్రదర్శనను వ్యతిరేకిస్తున్నాయి. 

సోషల్ మీడియా వేదికగా ఫవాద్ ఖాన్‌ ఈ దాడిని ఖండిస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశాడు. ఇక దాడి జరిగిన  రోజు ఫవాద్‌తో ఉన్న ఈ మూవీ పోస్టర్‌‌ను వాణీకపూర్‌‌ ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి.  దీంతో ఆ పోస్ట్‌ను ఆమె డిలీట్ చేసింది. రిద్ధి డోగ్రా, లీసా హైడన్‌, ఫరీదా జలాల్ ఇతర పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌‌టైనర్‌‌కు ఆర్తి ఎస్‌ బగ్దీ దర్శకత్వం వహించారు. వివేక్ అగర్వాల్, అవంతిక హారి, రాకేష్ సిప్పీ, ఫిరూజీ ఖాన్ నిర్మించారు.  

ఇది రెండోసారి

ఇలా ఫవాద్ ఖాన్ నటించిన ఇండియన్ సినిమా చిక్కుల్లో పడటం ఇది రెండో సారి. 2016 సెప్టెంబర్‌‌లో జరిగిన ‘ఉరి’ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తానీ కళాకారులను ఇండియన్ సినిమాల్లోకి తీసుకోకూడదని నిర్ణయించారు. అయితే అదే ఏడాది అక్టోబర్‌‌లో విడుదలైన ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’ చిత్రంలో ఫవాద్‌ ఖాన్ నటించాడు. దీంతో దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌‌ క్షమాపణలు చెప్పడంతో పాటు, భవిషత్తులో తాను పాకిస్తానీ ఆర్టిస్టులను తీసుకోనని హామీ ఇచ్చారు. 

అయితే ఎనిమిదేళ్ల గ్యాప్‌ తర్వాత ఫవాద్​ఖాన్‌ బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. తను హీరోగా ‘అబీర్ గులాల్‌’ చిత్రాన్ని అనౌన్స్ చేయడంతో వ్యతిరేకత మొదలైంది. ఈ నెల మొదటి వారంలో కూడా మహారాష్ట్ర నవనిర్మాణ సేన సినిమాను విడుదల చేయనివ్వబోమని హెచ్చరించింది. ఇప్పుడు పహల్గాం అటాక్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే ఈ చిత్రాన్ని బ్యాన్ చేస్తోంది. 

2017లో పాకిస్తానీ నటి మహీరా ఖాన్‌ నటించడంతో షారుక్ ఖాన్‌ ‘రయీస్‌’ చిత్రం కూడా బాయ్‌ కాట్‌ ఇబ్బందులను ఎదుర్కొంది. 2019 పుల్వామా దాడి అనంతరం ఇండియన్‌ సినిమాల్లో పాకిస్తాన్ యాక్టర్స్, సింగర్స్, టెక్నీషియన్స్‌ను బ్యాన్‌ చేయాలనే ఒత్తిడి మరింత పెరిగింది.  ఇలా టెర్రరిస్టుల అటాక్స్ జరిగిన ప్రతిసారి పాకిస్తానీ ఆర్టిస్టులను తీసుకోకూడదనే వాదనలు వినిపిస్తున్నా, బాలీవుడ్‌ ఫిల్మ్ మేకర్స్‌ మాత్రం పిలిచిమరీ వాళ్లకు అవకాశాలు ఇస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.