- ఒకవేళ ఏర్పాటు చేస్తే నోటీసులివ్వాలని రాష్ట్ర సర్కార్కు కేంద్రం ఆదేశం
- పర్యవేక్షణకు కమిటీ వేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇష్టారీతిన ఎలక్ట్రానిక్ వెహికల్స్ (ఈవీ) చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడంపై కేంద్రం సీరియస్ అయింది. నిబంధనలు ఉల్లంఘించి చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే వారిపై రెడ్కో ( పురుద్ధరణ ఇంధన అభివృద్ధి సంస్థ ) ద్వారా సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ ను ఆదేశించింది. ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు నిబంధనల అమలు, స్థలాల సేకరణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది..
ఇందుకోసం ఇంధన శాఖ కార్యదర్శి చైర్మన్ గా మున్సిపల్, ట్రాన్స్‌పోర్టు శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉండేలా వెంటనే కమిటీని నియమించి, ఈవీ స్టేషన్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని రాష్ట్ర సర్కార్ ను కేంద్రం కోరింది. రెడ్కో నుంచి ఎన్వోసీ ( నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ) తీసుకొని చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా రాష్ట్రం కఠినంగా వ్యవహరించాలని సూచించింది. తెలంగాణలో రోజు రోజుకు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వినియోగం పెరుగుతున్న దృష్ట్యా వాటికి సరిపడా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కేంద్రం సూచించింది. ఇదే సమయంలో నిబంధనలు పాటించకుండా ఎవరికి వారే సొంత నిబంధనలు ఏర్పాటు చేసుకొని చార్జింగ్ స్టేషన్లు పెడితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలకు వెనకాడొద్దని పేర్కొంది.
జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన, హైదరాబాద్ సిటీలో, ఓఆర్ ఆర్ అవతల పలు గేటెడ్ కమ్యూనిటీల్లో, పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లలో ఈ మధ్య కాలంలో రెడ్కో నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపింది. ఎన్వోసీ లేకుండా ఏర్పాటు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర సర్కార్ ను కేంద్రం కోరింది. రెడ్కో అనుమతులు తీసుకొని ఈవీ స్టేషన్లు ఏర్పాటు చేయాలనుకునే వారికి ప్రభుత్వం తరఫున మౌలిక సదుపాయాలు కల్పించడానికి సహకరించాలని రాష్ట్రాన్ని కేంద్రం ఆదేశించింది.