
- రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం
- గతంతో పోలిస్తే నిధులకు కోత
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం నిధులకు కోత పెట్టింది. గతేడాదితో పోలిస్తే తక్కువ నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. 2025–26 విద్యాసంవత్సరానికిగానూ రూ.245 కోట్లు ఇచ్చేందుకు విద్యాశాఖ అధికారులకు కేంద్రం హామీనిచ్చింది. ఇటీవల ఢిల్లీలో పీఎం పోషణ్ స్కీమ్ పై ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డితో పాటు విద్యాశాఖ అధికారులు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా 2025–26 అకాడమిక్ ఇయర్ లో తెలంగాణకు రూ.359 కోట్లు అవసరమని ప్రతిపాదనలు ఇచ్చారు. కానీ.. దీంట్లో రూ.245 కోట్లు ఇవ్వనున్నట్టు రాష్ట్ర బృందానికి ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు హామీనిచ్చింది.
దీంట్లో రూ.175 కోట్లు కేంద్రం వాటా కాగా.. మిగిలినవి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఇవ్వాల్సి ఉంది. ఈ విద్యాసంవత్సరం 2024– 25 లో రూ.266 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించగా..పూర్తిస్థాయి నిధులు ఖర్చు చేయకపోవడంతో మొత్తం నిధులు రిలీజ్ కాలేదు. మరోపక్క..బడుల్లో కిచెన్ గార్డెన్ల సంఖ్యను పెంచాలని, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, మిడ్డెమీల్స్ కార్మికులకు వంటల్లో మెలకువలను నేర్పించాలని కేంద్ర విద్యాశాఖ అధికారులు.. రాష్ట్ర అధికారులకు సూచించారు.