న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలోకి మరో 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా గత మూడున్నర నెలల్లో ఈ లబ్ధిదారులు కొత్తగా పథకంలో చేరారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు గతేడాది నవంబర్ 15న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను కేంద్రం ప్రారంభించింది.
ఇందులో భాగంగానే 2.60 లక్షల గ్రామ పంచాయతీల పరిధిలో 90 లక్షల మంది లబ్ధిదారులు చేరారని కేంద్రం చెప్పింది. పీఎం కిసాన్ పథకాన్ని 2019, ఫిబ్రవరి 2న కేంద్రం తీసుకొచ్చింది. ఏటా రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. 16వ విడత నిధులను ప్రధాని మోదీ తాజాగా విడుదల చేశారు. 11 కోట్ల మందికి పైగా ఖాతాల్లో ఈ నగదును వేశారు. పథకం కింద ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్లు పంపిణీ చేసినట్టు కేంద్రం పేర్కొంది.