గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి కేంద్రం చేయూత

  • నేషనల్​ లైవ్​స్టాక్​ మిషన్​ ద్వారా 50 % సబ్సిడీ 
  • యూనిట్​ కాస్ట్​ రూ.12 లక్షల నుంచి రూ.కోటి వరకు.. 
  • గొల్లకుర్మలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు చాన్స్​

మంచిర్యాల, వెలుగు: మాంసం ఉత్పత్తులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం  నేషనల్​ లైవ్​స్టాక్​మిషన్(ఎన్ఎల్ఎం) ద్వారా గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి చేయూతనిస్తోంది. యూనిట్​ విలువ రూ.12 లక్షల నుంచి రూ. కోటి కాగా, అందులో సర్కారు 50 % సర్కారు​ సబ్సిడీ అందిస్తోంది. గొల్లకుర్మలకే కాకుండా అన్ని సామాజిక వర్గాలకు చెందినవారు అర్హులే. పశుసంవర్థక శాఖ ద్వారా ఈ స్కీంను అమలు చేస్తోంది. ఈ పథకంపై అంతగా ప్రచారం, అవగాహన లేకపోవడంతో ఔత్సాహికుల నుంచి స్పందన కొరవడింది. ఇప్పటివరకు మంచిర్యాల జిల్లాలో 13 దరఖాస్తులు రాగా, నాలుగు యూనిట్లు గ్రౌండింగ్​ అయ్యాయి.  

ఐదు విభాగాలుగా యూనిట్లు  

ఎన్ఎల్ఎం ద్వారా ఇంతకుముందు రూ. కోటి విలువైన యూనిట్లను మాత్రమే మంజూరు చేశారు. ఇందులో రూ.50 లక్షలు సబ్సిడీ, రూ.40 లక్షలు బ్యాంక్​ లోన్​, మిగతా రూ.10 లక్షలు లబ్ధిదారుల వాటాగా ఉండేది. ఈ యూనిట్​ కింద 500 గొర్రెలు, 25 పొట్టేళ్లు ఇచ్చేవారు. యూనిట్​కాస్ట్​ఎక్కువగా ఉండడంతో బ్యాంకులు ష్యూరిటీ లేకుండా లోన్లు ఇవ్వడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ఎంల్​ఎం రూల్స్​ను సరళతరం చేస్తూ మార్పులు చేసింది. యూనిట్లను ఐదు విభాగాలుగా విభజించింది. 105 గొర్రెలకు రూ.12 లక్షలు, 210 గొర్రెలకు రూ.40 లక్షలు, 315 గొర్రెలకు రూ.60, 420 గొర్రెలకు రూ.80 లక్షలు, 525 గొర్రెలకు రూ.కోటి. ఇందులో ఏ యూనిట్​ను ఎంచుకున్నా 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. మేకలు, గొర్రెలే కాకుండా దేశవాళీ కోళ్లు, పందుల పెంపకం కూడా చేపట్టవచ్చు. వీటి యూనిట్​ కాస్ట్​ రూ.50 లక్షలకే పరిమితం.

రెండు నుంచి పదెకరాల భూమి 

ఎంపిక చేసుకున్న యూనిట్​ను బట్టి రెండు నుంచి పదెకరాల భూమి అవసరం ఉంటుంది. సొంత భూమి లేకుంటే లీజుకు తీసుకోవచ్చు. చుట్టూ ఫెన్సింగ్​వేసి, షెడ్లు నిర్మించి అందులోనే మేత ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. బ్యాంక్​ లోన్​ కోసం కాన్సెంట్​ తీసుకోవాలి. అన్ని ఒరిజినల్​ డాక్యుమెంట్లు జత చేస్తూ ఆన్​లైన్​లో nlm.udyamimitra.in వెబ్​సైట్​లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్​హార్డ్​కాపీలను జిల్లా పశుసంవర్థక శాఖ ఆఫీసులో సమర్పించాలి.  

ఎంపిక విధానం  

ఎన్ఎల్ఎంకు రాష్ట్ర స్థాయిలో యానిమల్​హజ్బెండరీ డైరెక్టర్​నోడల్​ఆఫీసర్​గా వ్యవహరిస్తారు. లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో రెండు కమిటీలు ఉంటాయి. ఆన్​లైన్​లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. బ్యాంక్​లోన్​శాంక్షన్​అయిన తర్వాత 25 శాతం, యూనిట్​ గ్రౌండింగ్​ సమయంలో మిగతా 25 శాతం సబ్సిడీ వస్తుంది. బ్యాంక్​లోన్​అవసరం లేదనుకుంటే లబ్ధిదారులు సొంతంగా కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు.  

సద్వినియోగం చేసుకోవాలి 

కేంద్ర ప్రభుత్వం ఎన్ఎల్ఎం ద్వారా గొర్రెలు, మేకలు, కోళ్లు, పందుల పెంపకంతో పాటు ఫీడ్​ అండ్​ఫాడర్​  ప్లాంట్​ ఏర్పాటు చేసుకోవచ్చు. అన్ని యూనిట్లపైనా 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. జిల్లాలో 13 దరఖాస్తులు రాగా నాలుగు యూనిట్లు శాంక్షన్​ అయ్యాయి. లాభదాయకమైన ఈ పథకాన్ని ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలి. 

- రమేష్​, జిల్లా పశువైద్య అధికారి