
- రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు
- ఎయిర్‌పోర్ట్ అథారిటికీ లేఖ రాసిన పౌర విమానయాన శాఖ
- 150 కిలోమీటర్లలోపు మరో ఎయిర్ పోర్ట్ ఉండకూడదన్న రూల్ సడలింపు
న్యూఢిల్లీ / వరంగల్, వెలుగు: వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మామునూరులో ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్‌కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్‌పోర్ట్ ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది.
దీనిపై పలుమార్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. దీంతో ఈ అంశంపై పౌర విమానయాన శాఖ గత నెల 25న ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌కు లేఖ రాసింది. ఈ లేఖను రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రిత్వ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (హెచ్ఐఏఎల్)కు పంపారు. దీనిపై స్పందించిన హెచ్ఐఏఎల్.. మామునూర్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్ఓసీ) జారీ చేసింది. దీనికి కేంద్రం ఆమోదముద్ర వేసింది.
ఇన్నాళ్లూ అడ్డంగా ఉన్న రూల్..
హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ సమయంలో కేంద్రం, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (హెచ్ఐఏఎల్) సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 25 ఏండ్ల లోపు ప్రస్తుత ఎయిర్ పోర్ట్‌కు 150 కిలోమీటర్ల పరిధిలో కొత్తగా దేశీయ/అంతర్జాతీయ విమానాశ్రం ఏర్పాటు చేయకూడదు. ఈ రూల్ కారణంగా రాష్ట్రంలో మరో ఎయిర్ పోర్టు నిర్మాణం జరగలేదు. అయితే ప్రస్తుతం హెచ్ఐఏఎల్ ఇచ్చిన ఎన్ఓసీ.. కేవలం మామునూరు ఎయిర్ పోర్ట్ కు మాత్రమే వర్తిస్తుంది.
భూ సేకరణకు రూ.205 కోట్లు చెల్లింపు
మామునూరు ఎయిర్ పోర్ట్ ను ఇపరేషన్స్ లోకి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. గతేడాది నవంబర్ 26న ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
ఎయిర్‌పోర్టు విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూ సేకరణకు సంబంధించి రూ.205 కోట్లను ఇప్పటికే ఏఏఐకి అందజేసినట్టు వివరించారు. విమానాశ్రయ పనులకు అనుమతులు, అక్కడి నుంచి విమానాలు నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వీటితోపాటు భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ లో విమానాశ్రయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని వరంగల్ ఎయిర్‌పోర్టుకు చకచకా అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నారు.
వరంగల్ ప్రజల కల సాకారం: మంత్రి కోమటిరెడ్డి
వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్రం అనుమతి మంజూరు చేయడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మామునూరు ఎయిర్‌పోర్టు కల సాకారమైందని మంత్రి పేర్కొన్నారు. ఇకపై ఎయిర్‌పోర్టు పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం అనుమతి తెలపడంపై మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కేంద్ర పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.