కేంద్రం సంచనల నిర్ణయం.. ఓటర్ ఐడీ ఆధార్ లింక్‎కు గ్రీన్ సిగ్నల్..!

కేంద్రం సంచనల నిర్ణయం.. ఓటర్ ఐడీ ఆధార్ లింక్‎కు గ్రీన్ సిగ్నల్..!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఓటర్ ఐడీకి ఆధార్ కార్డు అనుసంధానానికి సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం (మార్చి 18)
 కేంద్ర హోం కార్యదర్శి, శాసనసభ శాఖ కార్యదర్శి, ఆధార్ సీఈవో, యూఐడీఏఐ, ఈసీఐ సాంకేతిక నిపుణులతో సీఈసీ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని భారత ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి నిర్వాచన్ సదన్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ చేయడంపై చర్చించారు. ఈ సందర్భంగా..  ఓటర్ ఐడీకి ఆధార్ కార్డు అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధాన ప్రక్రియను మొదలుపెట్టేందుకు ఈసీ సిద్ధమైంది. 

ఈ మేరకు మంగళవారం (మార్చి 18) కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ చేస్తామని తెలిపింది. యూఐడీఏఐ, ఈసీఐ సాంకేతిక నిపుణుల మధ్య సాంకేతిక సంప్రదింపుల తర్వాత త్వరలోనే అనుసంధాన ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొంది. కాగా, దశాబ్ధాల కాలం నుంచి భారత దేశ రాజకీయాల్లో ప్రధాన సమస్య నకిలీ, బోగస్ ఓట్లు. ఈ సమస్యను అధిగమించేందుకు ఈసీ విశ్వ ప్రయత్నాలు చేసిన నకిలీ ఓట్లను పూర్తిగా అరికట్టలేకపోతుందని విమర్శలు ఉన్నాయి.

ALSO READ | చర్చకు మేం సిద్ధం: భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

 ఒకే నెంబర్ తో పదుల సంఖ్యలో ఓటర్ కార్డులు ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. గతేడాది జరిగిన హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ ఓట్లతోనే బీజేపీ విజయం సాధించిందని కాంగ్రెస్, పలు పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. ఈ క్రమంలో ఐటర్ ఐడీకి ఆధార్ కార్డు లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో నకిలీ, బోగస్ ఓట్లకు చెక్ పడొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.