కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ : విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత విద్యా విధానంలో మార్పు చేసింది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా నూతన విద్యావిధానానికి రూపకల్పన చేసింది. 10+2 విధానానికి స్వస్తి పలికిన కేంద్రం.. ఇకపై 5+3+3+4 విధానంలో బోధన కొనసాగుతుందని ప్రకటించింది. విద్యార్థుల వయసు ఆధారంగా ఫండమెంటల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ కోర్సులను బోధించనుంది. విద్యార్థులను కేవలం అకడమిక్స్కే పరిమితం చేయకుండా కో - కరికులర్ ప్రోగ్రామ్స్కు కూడా ప్రాధాన్యం ఇచ్చేలా సిలబస్ రూపొందించనున్నారు. ఆరో తరగతి నుంచే ఒకేషనల్ ఎడ్యుకేషన్ను భాగం చేయనున్నారు. 

ఫండమెంటల్ 
కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 4 నుంచి 8 ఏళ్ల పిల్లలకు ఫండమెంటల్ కోర్సు అందించనున్నారు. ఐదేళ్ల కాలపరిమితి గల ఈ కోర్సులో తొలి మూడేళ్లు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ తర్వాతి రెండేళ్లు విద్యార్థులకు ఒకటి, రెండో తరగతులు బోధన ఉంటుంది. ఫండమెంటల్ కోర్సులో యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ప్రిపరేటరీ
8 నుంచి 11ఏళ్ల వయసు పిల్లల కోసం మూడేళ్ల ప్రిపరేటరీ కోర్సు రూపొందించారు. ఈ దశలో 3,4,5 క్లాసులకు సంబంధించిన సిలబస్ బోధిస్తారు. ప్రిపరేటరీ కోర్సులో పిల్లలకు సైన్స్, మ్యాథమేటిక్స్, ఆర్ట్స్ పరిచయం చేస్తారు. విద్యా బోధనలో ప్రయోగాలకు పెద్ద పీట వేస్తారు. 

మిడిల్ స్కూల్
మిడిల్ స్కూల్ బోధన మూడేళ్ల పాటు కొనసాగనుంది. ఈ దశలో 11 నుంచి 14ఏళ్ల పిల్లలు 6,7,8 తరగతుల వరకు బోధన జరుగుతుంది. ఆరో తరగతి నుంచే సబ్జెక్టులతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్పుతారు. విద్యార్థులు తమకు నచ్చిన స్కిల్క్ నేర్చుకునే అవకాశం కల్పిస్తారు.

సెకండరీ స్కూల్
నాలుగేళ్ల పాటు సెకండరీ స్కూల్ కోర్స్ కొనసాగనుంది. ఈ దశలో విద్యార్థుల స్కూల్ విద్య పూర్తి కానుంది. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు 9 నుంచి 12వ తరగతి వరకు బోధన  ఉంటుంది. సెకండరీ స్కూల్లో విద్యార్థులకు సబ్జెక్టులపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. పిల్లలు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం ఇస్తారు. నూతన విద్యా విధానంలో స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ బోర్డులు విలీనం కానున్నాయి. ప్రస్తుతం పాఠశాలలతో సంబంధం లేకుండా అంగన్వాడీలు కొనసాగుతుండగా.. ప్రభుత్వ బడుల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులు లేవు. కానీ కొత్త పాలసీ ప్రకారం గవర్నమెంట్ స్కూళ్లలో సైతం ఫండమెంటల్ కోర్సులో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహించనున్నారు. 


              ఫండమెంటల్ కోర్సు
విద్యార్థి వయసు     తరగతి        
     04                       నర్సరీ
     05                      ఎల్కేజీ
     06                      యూకేజీ
     07                       ఫస్ట్ క్లాస్
     08                       సెకండ్ క్లాస్

            ప్రిపరేటరీ కోర్సు
విద్యార్థి వయసు    తరగతి
    09                       థర్డ్ క్లాస్
     10                      ఫోర్త్ క్లాస్
     11                      ఫిఫ్త్ క్లాస్

            మిడిల్ స్కూల్ కోర్సు
విద్యార్థి వయసు     తరగతి
     12                        సిక్స్త్ క్లాస్
     13                        సెవెంత్ క్లాస్
     14                        ఎయిత్ క్లాస్

             సెకండరీ స్కూల్ కోర్సు
విద్యార్థి వయసు     తరగతి
     15                       నైన్త్ క్లాస్
     16                       టెన్త్ క్లాస్
     17                       ఎఫ్వైజేసీ
     18                       ఎస్వైజేసీ 

టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉండవు
కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం.. విద్యార్థులకు ఐదో తరగతి వరకు మాతృ భాషలోనే బోధన కొనసాగనుంది. ఇప్పటి వరకు ద్వితీయ, తృతీయ భాషలుగా బోధించిన భాషలను ఇకపై సబ్జెక్టులుగా పరిగణించనున్నారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇకపై టెన్త్ క్లాస్లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉండవు. ఎస్వైజేసీలో మాత్రమే బోర్డ్ పరీక్షలు నిర్వహిస్తుంది. 

డిగ్రీ కోర్సు నాలుగేళ్లు
కాలేజ్ ఎడ్యుకేషన్ విషయానికొస్తే డిగ్రీ కోర్సు కాలపరిమితిని 3 నుంచి 4ఏళ్లకు పెంచారు. అయితే డిగ్రీ మధ్యలోనే మానేసినా వారికి సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. డిగ్రీ మొదటి ఏడాది పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్, సెకండ్ ఇయర్ పూర్తి చేస్తే డిప్లొమా, థర్డ్ ఇయర్ కోర్సు పూర్తి చేసిన డిగ్రీ పట్టా ఇవ్వనున్నారు. పీజీ కోర్సులు చేయాలనుకునే విద్యార్థులు మాత్రం నాల్గో ఏడాది తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారికి ఏడాది కాలపరిమితి గల ఎంఏ కోర్సు చేసే అవకాశం ఇస్తారు. కొత్త విధానంలో ఎంఫిల్ను రద్దు చేసిన కేంద్రం... ఎంఏ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా పీహెచ్డీ చేసే ఛాన్స్ ఇవ్వనుంది. 

కోర్సు మధ్యలో మరో కోర్సు చేసే ఛాన్స్
ప్రస్తుతం విద్యా విధానంలో ఒక కోర్సు పూర్తైన తర్వాతే మరో కోర్సు చేసే అవకాశముంది. కానీ కొత్త విధానంలో ఒక కోర్సు మధ్యలో బ్రేక్ తీసుకుని మరో కోర్సు చేసే ఛాన్సుంది. అయితే మొదటి కోర్సు కంప్లీట్ చేయాలనుకునే వారు నిర్ణీత కాలపరిమితిలో దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో కేంద్రం అనేక సంస్కరణలు చేసింది. రీజినల్ లాంగ్వేజ్లలో ఈ లెర్నింగ్ కోర్సులు ప్రారంభించడంతో పాటు వర్చువల్ ల్యాబ్స్ డెవలప్ చేయనుంది. ఏకీకృత విద్యా విధానం కోసం కేంద్రం నేషనల్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ ఫోరంను ప్రారంభించనుంది. కొత్త పాలసీ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ అనే తేడా లేకుండా అన్ని ఇన్స్టిట్యూట్లకు ఒకే విధమైన రూల్స్ అమలుకానున్నాయి.