అమెరికా మతస్వేచ్ఛ రిపోర్టుపై కేంద్రం మండిపాటు

న్యూఢిల్లీ: భారతదేశంలో మతస్వేచ్ఛపై అమెరికా​విడుదల చేసిన నివేదిక పక్షపాతపూరితంగా ఉన్నదని కేంద్రం​ ఆరోపించింది. అది కొన్ని సంఘటనలను మాత్రమే ఎంపిక చేసుకొని, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం రూపొందించిన నివేదిక అని  పేర్కొంది. భారతదేశ సామాజిక నిర్మాణంపై అవగాహన కూడా లేకుండా ఈ రిపోర్ట్​ తయారు చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్​ జైస్వాల్​శుక్రవారం విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. గత నివేదికలాగే ఇది కూడా పక్షపాతంగా ఉన్నదని అన్నారు. 

ఈ రిపోర్ట్​ మన రాజ్యాంగ నిబంధనలు, దేశ చట్టాల చెల్లుబాటును ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్నదని పేర్కొన్నారు. భారతీయ కోర్టులు ఇచ్చిన కొన్ని చట్టపరమైన తీర్పుల సమగ్రతను కూడా ఇది సవాల్​ చేస్తున్నదని అన్నారు. దేశంలో మైనార్టీలపై హింసాత్మక దాడులు పెరిగిపోయాయని బుధవారం విడుదలైన అమెరికా మతస్వేచ్ఛ రిపోర్ట్​ వెల్లడించింది. 2023 మేలో మణిపూర్​లో ప్రారంభమైన హింసను ఇది ఉదహరించింది. 

మణిపూర్‌‌‌‌లో 253 చర్చిలు దగ్ధమయ్యాయని చురాచంద్‌‌‌‌పూర్ జిల్లాకు చెందిన కుకీ గ్రూప్ తెలిపిన విషయాన్ని ఈ నివేదిక ఉటంకించింది. వందలాది దేవాలయాలు ధ్వంసమయ్యాయని మైతీ కమ్యూనిటీ కూడా పేర్కొన్నట్టు వెల్లడించింది. దీనిపై స్పందించిన భారత్​.. అమెరికాకు దీటైన సమాధానం ఇచ్చింది. 2023లో అమెరికా దేశంలోనే ద్వేషపూరిత నేరాలు, జాత్యహంకార దాడులు, భారత పౌరులు, ఇతర మైనార్టీలపైన దాడులు, ప్రార్థనా స్థలాల ధ్వంసం లాంటి ఘోరాలు జరిగాయని రణధీర్​ జైస్వాల్​ గుర్తుచేశారు. ఏదేమైనప్పటికీ భారతదేశంలోని ప్రజల రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడే హక్కు ఓ విదేశీ ప్రభుత్వానికి లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.