విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోలేదని ప్రకటించింది. ప్రైవేటీకరణ ఆపినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం అని వెల్లడించింది. ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని..విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని ప్రకటించింది. కంపెనీ సహకారంతో ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుందని తెలిపింది. ఆర్ఐఎన్ఎల్ ఉపసంహరణ ప్రక్రియపై ఎలాంటి ప్రతిష్టంభన లేదని ప్రకటించింది.
ఏప్రిల్ 13వ తేదీన విశాఖపట్నం వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. దాని కంటే ముందు అర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని వెల్లడించారాయన. పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని వివరించారు. వీటిపై అర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని చెప్పారాయన. తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఒక ఎత్తుగడ మాత్రమేనని.. ఇందులో వాస్తవం లేదని వ్యాఖ్యానించారు కేంద్ర సహాయ మంత్రి. దీని ద్వారా ప్రయివేటకరణ నిర్ణయం ప్రస్తుతానికి నిలిచినట్లుగా భావిస్తున్నామన్నారు.