కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రతిసారి రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉందని, తాజాగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని సైతం తుంగలో తొక్కి మరోసారి తెలంగాణ పట్ల తన వ్యతిరేక వైఖరిని బీజేపీ చాటుకుందని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ అన్నారు.

తాజాగా ఒక సమాచార హక్కు పిటీషన్‌కు సమాధానం ఇస్తూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి కార్యాలయం నుంచి ఇచ్చిన సమాధానంపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే హైదరాబాద్ నగర ఐటి అభివృద్ధిని అడ్డుకునేలా ఐటిఐఆర్ ప్రాజెక్టుని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఖాజీపేట రైల్వే ప్రాజెక్టు అవసరం లేదని స్పష్టం చేయడం వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినట్టయిందని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే మార్చుకుని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా విస్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రైల్వేల ప్రైవేటీకరణ చేయడంతో దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వరంగ సంస్థ అయిన రైల్వే నుంచి నూతన ఉద్యోగ నోటిఫికేషన్ రాకుండా దేశంలోని లక్షలాది మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఉందని మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం గగ్గోలు పెడుతున్న బిజెపి నాయకులు ఈ విషయంలో సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.