రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా వరంగల్, కరీంనగర్ పట్టణాలకు ఇప్పటికే 392 కోట్లు విడుదల చేశామన్నారు. అమృత్ పథకంలో భాగంగా రాష్ట్రం నుంచి ఎంపికైన 12 పట్టణాలకు 833.36 కోట్లు విడుదల చేశామని చెప్పారు. అమృత్ 2.0 లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 143 పట్టణాలలో 2,780 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకంలో రాష్ట్రానికి 2,49,465 ఇళ్లు మంజూరు చేయగా.. వీటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే 3,128.14 కోట్లు రూపాయలను విడుదల చేశామని చెప్పారు.
దేశంలో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్రం 2015లో స్మార్ట్ సిటీస్ మిషన్, అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్, అర్బర్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ పథకాలను ప్రారంభించిందని కిషన్ రెడ్డి తెలిపారు. స్మార్ట్ సిటీస్ మిషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా 100 నగరాలను ఎంపిక చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా వరంగల్, కరీంనగర్ పట్టణాలను ఎంపిక చేశామన్నారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కార్యక్రమం కింద వరంగల్ కు రూ. 500 కోట్లు, కరీంనగర్ కు రూ. 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తదుపరి విడత నిధులను విడుదల చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వం తన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సి ఉంటుందన్నారు.