ఎన్టీఏ డీజీ సుబోధ్ సింగ్​పై వేటు

ఎన్టీఏ డీజీ సుబోధ్ సింగ్​పై వేటు

నీట్, నెట్ పరీక్షల వివాదంపై కేంద్రం చర్యలు

నీట్, నెట్​ పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్​ను కేంద్రం బాధ్యతల నుంచి తప్పించింది.  ఎన్టీఏ బాధ్యతలను ఐటీపీఓ సీఈవో ప్రదీప్ సింగ్​ ఖరోలాకు అప్పగించింది.

న్యూఢిల్లీ: నీట్, నెట్​ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నేషనల్ టెస్టింగ్​ఏజెన్సీ(ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్​ను బాధ్యతల నుంచి తప్పించింది. ఆయనను పర్సనల్ డిపార్ట్ మెంట్​కు అటాచ్ చేస్తూ శనివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ఇతర బాధ్యతలు అప్పగించలేదని అధికారవర్గాల సమాచారం.

ఎన్టీఏ బాధ్యతలను తాత్కాలికంగా ఇండియా ట్రేడ్​ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీఓ) సీఈవో ప్రదీప్ సింగ్​ ఖరోలాకు అప్పగించింది. ఈమేరకు ఈ వివరాలను సీనియర్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ప్రశ్నాపత్రం మార్పు, విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడం, దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 100 పర్సెంట్ మార్కులు రావడం సహా విద్యార్థులు పలు ఆరోపణలు చేశారు. పేపర్ లీక్ ఆరోపణలు కూడా వినిపించాయి. దీనిపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, నీట్ రద్దుకు గానీ, కౌన్సెలింగ్ వాయిదా వేయడానికి కానీ సుప్రీంకోర్టు అంగీకరించలేదు.