ఇంఫాల్: మణిపూర్ లో నిర్వాసితులకు కేంద్రం ఏడు వేల ఇండ్లను సాంక్షన్ చేసింది. మరో రెండు వేల ఇండ్ల కోసం ప్రతిపాదనలను పరిశీలిస్తోందని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. బుధవారం ఆయన సెక్రటేరియెట్ లో మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలోని నిర్వాసితులకు కేంద్రం ఏడు వేల ఇండ్లను సాంక్షన్ చేసింది. ప్రస్తుతం వేర్వేరు స్కూల్స్, కాలేజీల్లో ఆశ్రయం పొందుతున్నవారు ఇందులోకి మారొచ్చు. మరో రెండు వేల ఇండ్ల సాంక్షన్ కు ప్రతిపాదనలు ఉన్నాయని.. అందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది” అని చెప్పారు.
ఇండ్ల పంపిణీకి సంబంధించిన వివరాలను కూడా సీఎం బీరేన్ సింగ్ వెల్లడించారు. బిష్ణుపూర్ లో 1,015, చురాచంద్ పూర్ లో 1,331, కక్చింగ్ లో 1,217, చందేల్ లో 511, కాంగ్ పోక్పిలో 1,813, వెస్ట్ ఇంఫాల్ లో 225, ఈస్ట్ ఇంఫాల్ లో 594 ఇండ్లను నిర్మించనున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో హైవేల నిర్మాణం కోసం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ రూ.1000 కోట్లను కేటాయించిందని వివరించారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంక్రీట్ రోడ్ల కోసం రూ.175 కోట్లు కేటాయించిందన్నారు.