కావాలనే రాష్ట్రాలకు కఠిన రూల్స్, వేధింపులు: పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకం రద్దుకు కేంద్రం కుట్ర చేస్తోందని, కావాలనే రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కక్ష కట్టి ఆరు నెలలుగా అక్కడ ఉపాధి హామీ పథకాన్ని నిలిపివేశారని అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు– సవాళ్లు’ అనే అంశంపై హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంగళవారం సెమినార్ నిర్వహించారు.
మంత్రి ఎర్రబెల్లి, కేరళ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలైన చత్తీస్ గఢ్, రాజస్థాన్, పంజాబ్ లో ఇప్పటికే తనిఖీ టీమ్లను పంపి లేనిపోని ఆరోపణలు మొదలు పెట్టారని తెలిపారు. తెలంగాణకు ఈ ఏడాది 18 టీమ్లను పంపించి లేని తప్పులను ఎత్తి చూపి, పేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతు కల్లాల నిర్మాణాన్ని కూడా కేంద్రం తప్పుపడుతోందన్నారు. నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయడం లేదన్నారు.
కేంద్రం తీరుపై కేరళతో కలిసి పోరాటం చేస్తామన్నారు. కేరళ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ రాజేష్ మాట్లాడుతూ.. ఇప్పటికే బడ్జెట్లో పథకం నిధులను భారీగా తగ్గించారన్నారు. రాష్ట్రాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని విమర్శించారు. సెమినార్ లో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఎం జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘాల బాధ్యులు, పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్మికులు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.