
ఢిల్లీ: దేశంలోని 5 రాష్ట్రాలకు విపత్తు, వరద సాయం కింద నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ, తెలంగాణ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు రూ.1554.99 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో బుధవారం (ఫిబ్రవరి 19) జరిగిన ఉన్నత స్థాయి కమిటీ మీటింగ్‌లో ఈ నిధుల విడుదలకు ఆమోదం లభించింది. 2024లో వరదలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా ప్రభావితమైన రాష్ట్రాలకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం అదనంగా రాష్ట్రాలకు ఈ నిధులను అందజేస్తోంది.
ఐదు రాష్ట్రాలకు విడుదల చేసిన రూ.1554.99 కోట్లలో ఏపీకి రూ. 608.08 కోట్లు, తెలంగాణకు రూ. 231. 75 కోట్లు, త్రిపురకు రూ. 288.93 కోట్లు, ఒడిశాకు రూ. 255.24 కోట్లు, నాగాలాండ్‌కు రూ. 170.99 కోట్లు కేటాయించింది. కాగా, 2024లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు, వరదలు వణించిన విషయం తెలిసిందే. వరద నీరు ఉప్పొంగి ఏపీలో బుడమేరు వాగు, తెలంగాణలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. వందల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు.
Also Read:-ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా..? వైసీపీ అధినేత జగన్ గరంగరం
వరదల్లో సర్వస్వం కోల్పోయి నిస్సాహయ స్థితిలో రోడ్డున పడ్డారు. దీంతో వరద బాధితులను ప్రభుత్వాలు ఆదుకున్నాయి. వరదల ధాటికి రోడ్లుకు కొట్టుకుపోవడం, కాలువలు తెగిపోవడంతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లింది. దీంతో వరదలతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని ఆదుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపగా.. తాజాగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.