ఏపీకో న్యాయం.. తెలంగాణకో న్యాయమా?

ఏపీకో న్యాయం.. తెలంగాణకో న్యాయమా?
  • రాష్ట్రానికి రూ.10వేల కోట్ల విపత్తు సాయం ఇవ్వండి: ఎమ్మెల్యే కూనంనేని

హైదరాబాద్, వెలుగు: వరద సహాయం విషయంలో కేంద్రం వివక్ష చూపుతున్నదని, ఏపీకో న్యాయం..తెలంగాణకో న్యాయమా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. వరదల వల్ల ప్రజలు సర్వం కోల్పోయారని,  జాతీయ విపత్తుగా ప్రకటించి, తెలంగాణకు కేంద్రం రూ.10 వేల కోట్లు ఇవ్వాలని  డిమాండ్​ చేశారు.  ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సింది పోయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతారాహిత్యమైన  వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని  అన్నారు.  ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే యుటిలిటీ  నిధులు వాడుకోవాలని  అనడం ఎంతవరకు కరెక్ట్​ అని ప్రశ్నించారు.

యుటిలిటీ నిధులు కాకుండా కేంద్రం సహాయం చేయదా? అని ఫైర్​అయ్యారు. పార్టీ  మారిన ఎమ్మెల్యేల పదవులను వెంటనే రద్దుచేసి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని, హైకోర్టు తీర్పు హర్షణీయమని పేర్కొన్నారు.  సోమవారం హైదరాబాద్ ​హిమాయత్​నగర్​లోని ముగ్దూం భవన్​లో కూనంనేని మీడియాతో మాట్లాడారు.  ఇండ్లు, పంట పొలాలు మట్టితో నిండిపోయాయని,  పశువులకు మేత కూడా దొరకని పరిస్థితి నెలకొందని, జరిగిన నష్టంలో సగం పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్​ చేశారు. కూలిపోయిన, దెబ్బతిన్న ఇండ్లకు, పంట నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం  ఇచ్చే రూ.10 వేలు సరిపోవని,  ఇంకా పెంచి ఇవ్వాలని సూచించారు.

తన  నెల జీతం రూ.2.50 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంలో సీపీఐ భాగస్వామి కాదని, ఎన్నికల్లో కలిసి పోటీ మాత్రమే చేశామని కూనంనేని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నదని, ప్రభుత్వంలో తాము భాగస్వామ్యం అయితే అధికారికంగా నిర్వహించే వాళ్లమని పేర్కొన్నారు. 

మావోయిస్టులు ఏమైనా రాక్షసులా? 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టుల  పేరుతో ఊచకోత మొదలు పెట్టిందని కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ఒకప్పటి మావోయిస్టు పేరుతో వందల మందిపై కేసులు పెడుతున్నారని, ఎన్ఐఏ లాంటి సంస్థలను ఉపయోగించి అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని  మండిపడ్డారు. ‘‘మావోయిస్టులు ఏమైనా రాక్షసులా? అమిత్ షాకు ఎందుకంత కక్ష?’’ అని ప్రశ్నించారు.  మావోయిస్టులు కూడా కోర్టుల పేరుతో ఇష్టానుసారంగా చంపుతున్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు.

 మావోయిస్టులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని కూనంనేని సూచించారు. ఈ నెల  11 నుంచి 17 వరకు రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుతామని తెలిపారు. 21వ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుందని ప్రకటించారు. తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని కోరారు.  తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించవద్దని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యపుస్తకాల్లో సాయుధ పోరాటాన్ని చేర్చాలని కోరారు.