బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు తీసేస్తోందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే హక్కు తమకు లేదని ప్రధాని మోడీ రామగుండంలో చెప్పితే.. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాక్ లను వేలం వేస్తామని పార్లమెంట్ లో కేంద్ర మంత్రి చెప్పారన్నారు. మోడీ ఒకలా.. మంత్రి మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని విమర్శించారు. బెల్లంపల్లిలో 100 పడకల నూతన ఆసుపత్రిని, డయాలసిస్ సెంటర్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి కార్మికుల పిల్లలకు స్పెషల్ రిజర్వేషన్ కల్పించనున్నట్లు హరీశ్ రావు ప్రకటించారు. బెల్లంపల్లిలోని వంద పడకల ఆసుపత్రికి సరిపడా డాక్టర్లు, సిబ్బందిని త్వరలోనే నియమిస్తామని హామీనిచ్చారు. మంచిర్యాల కరీంనగర్ హైదరాబాద్ కి వెళ్లకుండా బెల్లంపల్లిలోనే వైద్య సేవలు అందిస్తామన్నారు.