- అస్సాం, వెస్ట్ బెంగాల్‌కు కేంద్రం హెచ్చరిక
- కరోనా కేసులు పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని సూచన
న్యూఢిల్లీ: దేశంలోని అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అక్కడ కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతుండటం, టెస్టుల సంఖ్య తగ్గుతుండటంతో ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా రూల్స్‌ను కఠినంగా అమలు చేయడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు అస్సాం, బెంగాల్ సీఎస్‌లకు అక్టోబర్ 26న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహుజా లేఖ రాశారు. గత వారం రోజులుగా ఈ రెండు రాష్ట్రాల్లో (అక్టోబర్ 20 నుంచి 26 వరకు) కేసులు పెరుగుతున్నాయని, గడిచిన 4 వారాల్లో పాజిటివిటీ రేటు కూడా పెరిగిందన్నారు. ఈ నెల మొదట్లో దుర్గా పూజల సందర్భంగా కోల్‌కతాలో కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ అక్టోబర్ 22న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్ లెటర్ రాశారు. అస్సాంలో అక్టోబర్ 20 నుంచి 26 వరకు కొత్త కేసుల్లో 41% పెరుగుదల కనిపించిందన్నారు. టెస్టుల సంఖ్య, వ్యాక్సినేషన్‌లో స్పీడ్ తగ్గించడంతోనే కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.
దేశంలో 14 వేల కేసులు.. 549 మరణాలు
శుక్రవారం ఒకే రోజు కొత్తగా దేశవ్యాప్తంగా 14,313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్‌తో 549 మంది మరణించగా, మరణాల సంఖ్య 4,57,740కి పెరిగిందని చెప్పింది. అలాగే 13,543 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారని, దీంతో కోలుకున్న మొత్తం పేషెంట్ల సంఖ్య 3,36,41,175 కు చేరిందని చెప్పింది. దేశంలో యాక్టివ్ కేసులు 1,61,555కు చేరుకున్నాయంది.
తెలంగాణలో 168 కేసులు..
తెలంగాణలో మరో 168 మంది కరోనా బారిన పడ్డారని హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. శనివారం 37,882 మందికి టెస్టులు చేస్తే, గ్రేటర్ హైదరాబాద్‌లో 62 మందికి, జిల్లాల్లో 106 మందికి పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. వైరస్‌తో మరొకరు చనిపోగా, మరణాల సంఖ్య 3,955కి పెరిగిందని తెలిపింది.