మునుగులో ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ నాయకుల మధ్య విమర్శలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒకరినొకపై ఒకరు ఆరోపణలు చేస్తూ ఇచ్చిన హామీలపై నిలదీస్తున్నారు. అందులో భాగంగా మంత్రి హరీశ్ రావు సైతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తీవ్రంగా మండిపడ్డారు. 2016లో మర్రిగూడలో నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పర్యటిస్తూ, ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తమన్నరు.. ఈ హామీ ఇచ్చి ఆరేళ్లయిందని, ఈ సెంటర్ ఏర్పాటు కోసం చౌటుప్పల్ లో 8.2 ఎకరాల స్థలం కూడా తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని హరీశ్ రావు అన్నారు.
కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ కు నయా పైసా ఇవ్వలేదని హరీశ్ రావు ఆరోపించారు. మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తమని కూడా హమీ ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అబద్దపు హమీలిస్తూ, ప్రజల గోడు పట్టని బీజేపీ నేతల్లారా... ఏం ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ది చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు.