రాష్ట్రాల అభిప్రాయం తీసుకుని యూసీసీ రూపొందించాలి: కేజ్రీవాల్

కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ ఫైర్

భావ్​నగర్: యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) అమలు కోసం కమిటీని ఏర్పాటు చేయడం వెనుక గుజరాత్ సర్కారు ఉద్దేశాన్ని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. బీజేపీ సర్కారుకు నిజంగానే యూసీసీ తేవాలనే ఉద్దేశమే ఉంటే దేశమంతటా ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు. గుజరాత్​ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేజ్రీవాల్ ఆదివారం బావ్​నగర్​లో మీడియాతో మాట్లాడారు.

యూసీసీని అమలు చేసేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు గుజరాత్ సర్కారు శనివారం ప్రకటించింది. దీని వెనుక బీజేపీ సర్కారుకు చెడు ఉద్దేశం ఉందని కేజ్రీవాల్ మండిపడ్డారు. యూసీసీ రూపొందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 స్పష్టంగా చెప్తోందన్నారు.

దాని ప్రకారం కేంద్రం అన్ని రాష్ట్రాల అభిప్రాయం సేకరించి యూసీసీని రూపొందించాలని అన్నారు. ఇది ఎన్నికల స్టంట్​అని ఆరోపించారు. గతంలో ఉత్తరాఖండ్​ఎన్నికలకు ముందు కూడా బీజేపీ ఇలాంటి కమిటీని ఏర్పాటు చేసి.. ఎన్నికల్లో గెలవగానే ఆ కమిటీ కనబడకుండా పోయిందని చెప్పారు.