బెల్లంపల్లి: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో అన్ని సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల ఎల్సీ నెంబర్ 63 రైల్వే గేటు వద్ద కొత్తగా నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో నవజీవన్, కేరళ, జీటీ ఎక్స్‌ప్రెస్ తో పాటు వందేభారత్, కొత్తగా ప్రారంభించిన అయోధ్య సూపర్‌ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలన్నారు. బెల్లంపల్లి రైల్వే హాస్పిటల్లో బెడ్ల సంఖ్యను 20కి పెంచాలన్నారు. మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, కౌన్సిలర్లు పత్తిపాక రేణుక, బండి ప్రభాకర్ యాదవ్, కెంశెట్టి సరిత పాల్గొన్నారు.
అమృత్ భారత్ స్టేషన్ పనులకు శంకుస్థాపన
మంచిర్యాల, వెలుగు: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా మంచిర్యాల రైల్వే స్టేషన్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ సోమవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. జిల్లాలో మూడు అండర్ పాస్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైల్వే అధికారులతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు పాల్గొన్నారు. విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శన ఏర్పాటు చేయడంతో పాటు రైల్వేల అభివృద్ధిపై డ్రాయింగ్, ఎస్సే రైటింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మంచిర్యాలలో మరిన్ని సూపర్ ఫాస్ట్ రైళ్ల హాల్టింగ్ కోసం రైల్వే మినిస్టర్ అశ్వినీవైష్ణవ్‌ను కోరతామని రఘునాథ్‌రావు తెలిపారు.