- నీళ్ల పంచాయితీకి తెరపడ్తదా?
- కృష్ణా, గోదావరి జల వివాదాలపై రేపు ఢిల్లీలో మీటింగ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య నదీ జల వివాదాల పరిష్కారం కోసం కేంద్రం మంగళవారం ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తోంది. కృష్ణా బోర్డు హెడ్ క్వార్టర్స్‌ను ఏపీకి తరలించడం, రెండు రాష్ట్రాలు బోర్డు నిర్వహణ కోసం నిధులు విడుదల చేయడం, రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు బోర్డు అనుమతుల కోసం డీపీఆర్‌లు సమర్పించడం, వాటాల ప్రకారం నీటి పంపిణీ, బోర్డుల అధికార పరిధిని నిర్ధారించడం, రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ చేపట్టడం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
బోర్డుల ఇబ్బందులతో..
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో నిధులు ఇవ్వక కృష్ణా, గోదావరి నదీ బోర్డుల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం జోక్యం చేసుకుని మీటింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఏపీ సర్కారు పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలిస్తుండటంతో.. కృష్ణాలో తెలంగాణకు 45 టీఎంసీల నికర జలాలను అదనంగా కేటాయించాల్సి ఉంది. దీనిని మొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు వ్యతిరేకించారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ సీఎంల మధ్య స్నేహబంధం ఉండటంతో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
డీపీఆర్‌లపై స్పష్టత..
రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి, సీతారామ, తుపాకులగూడెం, డిండి, తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ల డీపీఆర్‌ల కోసం గతంలో రెండు నదీ మేనేజ్మెంట్ బోర్డులు లేఖలు రాశాయి. తాజా మీటింగ్ ఎజెండాలో డీపీఆర్‌ల అంశం చేర్చడంతో వీటిపైనా స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్టు కాదని, రాష్ట్ర అవసరాల కోసం రీ ఇంజనీరింగ్ చేసిన ప్రాజెక్టులేనని వివరించనుంది. ఆయా ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ, కేంద్రం గతంలోనే అనుమతులు ఇచ్చాయన్న విషయాన్ని వివరించాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ సోమేశ్‌కుమార్ సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా.. మరో సీనియర్ అధికారి సమావేశానికి వెళ్లనున్నట్టు తెలిసింది.
తాగునీటి కేటాయింపుల్లో..
తాగునీటి అవసరాలకు కేటాయిస్తున్న నీటిలో 20 శాతం నీటి వినియోగాన్ని మాత్రమే లెక్కించాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతోంది. గతంలో జరిగిన కృష్ణా బోర్డు మీటింగ్‌లో ఏపీ ఈ వాదనతో ఏకీభవించింది. తాగునీటి కోసం విడుదల చేస్తున్న నీటిలో 20 శాతం మాత్రమే అందుకోసం వినియోగిస్తున్నారని, మిగతా 80 శాతం నీళ్లు తిరిగి నదుల్లోనే కలుస్తున్నాయని ఇంజనీర్లు శాస్త్రీయంగా వివరించారు. ఇరు రాష్ట్రాలు అంగీకరించడంతో దీనిపై నిర్ణయం తీసుకునే
అవకాశముంది.
see more news ప్లీజ్ ..ఓటేసి పోండి..ఊరెళ్లిన ఓటర్లకు క్యాండిడేట్ల అభ్యర్థన