న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 81.35 కోట్ల మందికి ఏడాదిపాటు ఉచిత రేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద పంపిణీ చేసేందుకు ఆమోదం తెలిపింది. శుక్రవారం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. మీటింగ్ ముగిసిన తర్వాత కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. ‘‘పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని ప్రధాని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 81.35 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు” అని గోయల్ అన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఉచితంగా ఆహార ధాన్యాలను ఇచ్చేందుకు అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని తెలిపారు. ఏటా ప్రభుత్వ ఖజానాపై రూ.2 లక్షల కోట్ల భారం పడుతుందని చెప్పారు. పీఎంజీకేఏవై కింద కేంద్రం 28 నెలలపాటు ఫ్రీగా ఆహార ధాన్యాలను పంపిణీ చేసిందని గుర్తు చేశారు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏతో పీఎంజీకేఏవైని విలీనం చేశామని తెలిపారు. కరోనా టైమ్‌లో ప్రజలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో పీఎంజీకేఏవై కింద అదనంగా ఆహారధాన్యాలను పంపిణీ చేశామని, ఇప్పుడు అది అవసరం లేదని చెప్పుకొచ్చారు.
వచ్చే డిసెంబర్ దాకా..
ప్రస్తుతం ఎన్‌ఎఫ్‌ఎస్ఏ కింద ఒక్కొక్కరికి 5 కేజీల ఆహార ధాన్యాలను సబ్సిడీ కింద ప్రతినెల కేంద్రం అందజేస్తున్నది. కిలోకు రూ.1 నుంచి 3 తీసుకుంటున్నది. అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కింద కవర్ అయ్యే కుటుంబాలకు 35 కిలోల చొప్పున ఆహారా ధాన్యాలను ప్రతి నెల ఇస్తున్నది. తృణధాన్యాలకు కిలోకు రూ.1, గోధుమలకు కిలోకు రూ.2, బియ్యానికి కిలోకు రూ.3 చొప్పున తీసుకుంటున్నది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో.. 2023 డిసెంబర్ దాకా ఉచితంగా ఆహార ధాన్యాలను పేదలకు అందించనుంది.
పీఎంజీకేఏవై నిలిపివేత
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద అమలు చేస్తున్న ఉచిత రేషన్ స్కీమ్‌ను పొడిగించొద్దని కేంద్రం నిర్ణయించింది. పీఎంజీకేఏవై కింద ప్రతినెల 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు 5 కిలోల ఆహార ధాన్యాలను కేంద్రం ఇస్తూ వచ్చింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక పీఎంజీకేఏవై కింద ఉచిత రేషన్ ఇవ్వడాన్ని కేంద్రం 2020 ఏప్రిల్‌లో మొదలుపెట్టింది. ఈనెల 31 దాకా దాన్ని పొడిగిస్తూ వచ్చింది.
సాయుధ దళాల సిబ్బంది పెన్షన్ సవరణకు ఓకే
‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ కింద సాయుధ దళాల సిబ్బంది పెన్షన్ సవరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2019 జులై 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని, 25 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి కలుగుతుందని చెప్పింది. ఈ నిర్ణయంతో కేంద్రంపై 8,450 కోట్ల అదనపు భారం పడుతుందని డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. 2019 జులై నుంచి 2022 జూన్ దాకా బకాయిల కింద రూ.23,638 కోట్లను పెన్షనర్లకు చెల్లించనున్నట్లు వివరించింది.