న్యూఢిల్లీ: పొరుగు దేశం చైనాను గడగడలాడిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. ఇదేమీ కొత్త వైరస్ కాదని.. 2001లోనే హెచ్ఎంపీవీ వైరస్‌ను గుర్తించారని తెలిపారు. భారత్‌లో కూడా హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని.. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. ప్రస్తుతం భయపడాల్సిన అవసరమేమీ లేదని ప్రజలకు ధైర్యం చెప్పారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, చైనాను వణికిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్‌లోకి ఎంటరైన విషయం తెలిసిందే.
ALSO READ | HMPV కేసులు: మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ లో తాజా పరిస్థితులు ఇలా..
మొత్తం నాలుగు కేసులో ఇండియాలో వెలుగు చూశాయి. కర్నాటక రాజధాని బెంగుళూరులో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్ నిర్ధారణ కాగా.. కోల్ కతాలో ఒకటి, అహ్మదాబాద్‌లో మరో కేసు నమోదు అయ్యింది. హెచ్ఎంపీవీ వైరస్ భారత్‌లో వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. హెచ్ఎంపీవీ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖకు అప్డేట్ చేయాలని ఆదేశించింది.