జీవనోపాధుల కేంద్రాలు మహాసముద్రాలు!

జీవనోపాధుల కేంద్రాలు మహాసముద్రాలు!

నీరు లేనిదే జీవం లేదు. నీలి సముద్రం లేనిదే  హరిత ధరణి లేదు. ధరణి ఉపరితలం 71శాతం మహా సముద్రాల లవణ జలాలతో నిండి ఉంది. మహాసముద్ర జలాలు అపారమైన  జంతు, ఇతర జీవులకు నెలవుగా ఉంటున్నాయి. 1992లో ‘రియో డి జనేరో’లో  జరిగిన ‘ఎర్త్​ సమిట్’లో  తీసుకున్న నిర్ణయం మేరకు ఐరాస, ‘సముద్ర చట్టాల’ సమన్వయంతో ప్రతి ఏటా జూన్‌‌ 8న  ‘ప్రపంచ మహాసముద్ర దినోత్సవం’ పాటించుట జరుగుతోంది. 

సముద్రాల ప్రధాన ప్రయోజనాలు

భూగ్రహంపై ఉష్ణోగ్రత నియంత్రణ, వాతావరణంలో దాదాపు 70 శాతం ఆక్సిజన్‌‌ను అందుబాటులో ఉంచడంలో సముద్రాలు ప్రధాన భూమికను నిర్వహిస్తాయి.  ప్రపంచ అడవుల వల్ల 28 శాతం మాత్రమే ఆక్సిజన్‌‌ లభిస్తున్నది. సముద్ర జలాల్లో ఉన్న సీ వీడ్స్‌‌, ఫైటోఫ్లాంక్టన్‌‌, ఇతర సముద్ర మెుక్కలు  మనిషి విడుదల చేసిన 30 శాతం కార్బన్‌‌ డై ఆక్సైడ్‌‌ను పీల్చుకొని ప్రాణవాయువుగా మార్చుతున్నాయని తెలుసుకోవాలి.  సముద్రాలతో  భూఉపరితల వాతావరణం  నియంత్రించబడుతుంది.  ఉపరితల గాలులు, వాటర్‌‌ కరెంట్లతో  భూ ఉపరితలంపై జీవులకు అనువైన వాతావరణం నెలకొంటుంది.  సముద్ర ఆహారంతో ప్రజారోగ్యమే కాకుండా మిలియన్ల ప్రజలకు జీవనోపాధి కల్పించబడుతున్నది. సాలీనా  సముద్ర ఆధార వ్యాపారం ద్వారా 282 బిలియన్‌‌ డాలర్ల ఆదాయం వస్తున్నది. సముద్ర జలాల్లోని 91 శాతం జీవుల ఉనికి నేటికీ తెలియదనే వాస్తవం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. సముద్రాల ఇతర ప్రయోజనాల్లో ఉపరితల వ్యాపారం, రవాణా, పవర్‌‌ జనరేషన్‌‌,  క్రీడలు,  పర్యాటకం,  ఖనిజ సంపద,  ఇంధనం లాంటి  పలు అంశాలు కూడా ఉన్నాయి.  భూమిపై ఉన్న అత్యధిక జీవ వైవిధ్యత సముద్ర జలాల్లోనే ఉన్నది. దాదాపు ఒక బిలియన్‌‌ ప్రపంచ ప్రజలకు ప్రోటీన్‌‌  పోషకాహారంగా  సముద్ర జీవులు ఉపయోగపడుతున్నాయి.  2030 నాటికి సముద్ర ఆధార ఆర్థిక వ్యవస్థ ద్వారా 40 మిలియన్ల ప్రజలు జీవనోపాధిని పొందుతారని అంచనా వేస్తున్నారు.

కాలుష్యం బారిన సముద్రాలు

 జీవ వైవిధ్యం, ప్రాణికోటి మనుగడను సుసాధ్యం చేయడంలో సముద్రాల ప్రాధాన్యతను చర్చించే నిమిత్తం ప్రతి ఏటా  జూన్‌‌ 8న  ‘ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం (వరల్డ్ ఓషియన్స్‌‌ డే)’ నిర్వహించుట జరుగుతున్నది.  ప్రపంచ మహాసముద్రాల దినం-2024 థీమ్​గా  ‘వేవ్స్‌‌ ఆఫ్‌‌ ఛేంజ్‌‌ : కలెక్టివ్‌‌ ఆక్షన్స్‌‌ ఫర్‌‌ ఓషియన్స్‌‌‌‌‌‌‌‌’ అనే అంశాన్ని తీసుకొని, సముద్ర జీవరాశులతో మానవాళికి ఉన్న సంబంధాలను చర్చించుట జరుగుతుంది. మానవాళి సంక్షేమానికి తన వంతు బాధ్యతలను నిస్వార్థంగా నిర్వహిస్తున్న సముద్రాలకు కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ, సముద్రాల సహజత్వాన్ని, సముద్ర జీవుల పరిరక్షణకు పూనుకోవాలనే సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. నేటి ఆధునిక మానవుని దురాశ వల్ల 90 శాతం పెద్ద చేపలు అంతరించాయని, 50 శాతం కోరల్‌‌ రీఫ్స్‌‌ విధ్వంసానికి గురి అయ్యాయని తెలుస్తున్నది. సముద్రాల కాలుష్యాలలో విష రసాయనాలు, ప్లాస్టిక్‌‌, చమురు లీకేజీలు, పారిశ్రామిక, - వ్యవసాయ వ్యర్థాలు, మురుగు నీరులాంటివి ముఖ్యమైనవి.  సముద్రాలలో  చేపల కన్నా  ప్లాస్టిక్‌‌ వ్యర్థాలు అధికంగా 8 మెట్రిక్‌‌ టన్నులు ఉన్నాయని, ప్రతి ఏటా 17.6 బిలియన్‌‌  పౌండ్ల ప్లాస్టిక్‌‌ సముద్రాలలో కలుస్తున్నదని అంచనా.  

సముద్రాలను పరిరక్షించాలి

సముద్రాలను పరిరక్షించడం, సముద్రాలతో మానవాళి సంబంధ సమతుల్యత సాధించడం మన తక్షణ కర్తవ్యంగా భావించాలి.  సముద్ర జలాల్లో అతిగా చేపలు పట్టడం,  సముద్ర జలాలు కలుషితం చేయడం, సముద్ర జీవుల ఉనికికే  ప్రమాదం వాటిల్లడం లాంటి చర్యలతో మనిషి సముద్రాల సమతుల్యతను దెబ్బ తీయడం జరుగుతున్నదని గమనించాలి.  మహాసముద్రాలు  భూమాతకే కాకుండా సకల జీవరాశులకు రక్షణ కవచమని, సాగరాన్ని అలక్ష్యం చేస్తే జీవావరణం నిర్జీవం అవుతుందని గుర్తించాలి.

  

- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి