‘తాజ్​మహల్’ పప్పులో జెర్రీ

బషీర్ బాగ్, వెలుగు: అబిడ్స్ లోని తాజ్ మహల్ హోటల్ పప్పులో జెర్రీ వచ్చింది. సికింద్రాబాద్ కు చెందిన అశోక్ ఓ క్లాత్ షోరూమ్ లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. పనిలో భాగంగా తోటి ఎంప్లాయ్స్​తో కలిసి మంగళవారం అబిడ్స్ వచ్చాడు. స్థానిక తాజ్ మహల్ హోటల్​లో భోజనం చేసేందుకు వెళ్లాడు. సౌత్ ఇండియన్ వెజ్ తాలీ ఆర్డర్ ఇచ్చాడు. భోజనం చేస్తుండగా పప్పులో జెర్రీ ప్రత్యక్షమవడంతో కంగుతిన్నాడు.

హోటల్ యాజమాన్యాన్ని నిలదీయగా పాలకూరలో వచ్చి ఉంటుందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వెంటనే ఆన్​లైన్​లో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని వాపోయాడు. అయితే అశోక్​గొడవకు దిగడంతో హోటల్​నిర్వాహకులు ఫుడ్ సెక్షన్ కు తాళాలు వేసి కస్టమర్లను పంపించేశారు.