ప్రభుత్వాల అప్పులకు హద్దేలేదా?

కేంద్ర, రాష్ట్రాల రుణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టి తమకు తోచిన రీతిలో, ప్రణాళిక లేకుండా అప్పులు చేస్తూ, ప్రభుత్వ ఆస్తులు అమ్ముతూ, రాజకీయ లబ్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజ్యాంగ సంస్థలు కూడా తమ మేధా సంపత్తి జోడించి ఇతోధిక సాయం చేస్తున్నట్లుగానే కన్పిస్తోంది. ఎన్నో రకాల చట్టాలు, రాజ్యాంగ పరిమితులు ఉన్నా ఉపయోగం లేకుండా పోతోంది. మార్కెట్ రుణాలూ పెరుగుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాలు చేస్తున్న రుణాలను నియంత్రించాల్సిన ఆర్​బీఐ.. పూర్తి స్థాయిలో వాటితో కలిసే ఉంటోంది. ఆర్థిక సరళీకరణ విధానాల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుంటూ, రాజ్యాంగ సంస్థలను వినియోగిస్తూ, ప్రజల ఆస్తులను, ప్రజా ధనాన్ని అంగడిలో సరుకు చేస్తున్న వైనం ఆందోళనకరం.

రెండు దశాబ్దాలుగా దేశంలో ఆర్థిక వికేంద్రీకరణ దిశగా అడుగులు పడుతూనే ఉన్నాయి. కేంద్రం మీద ఆధారపడకుండా రాష్ట్రాలు అప్పులు తీసుకునే అవకాశం ఏర్పడటంతో అవి తీసుకుంటున్న మార్కెట్ రుణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు పరిమితికి మించి రుణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తీసుకున్న అప్పులకు వడ్డీల భారం పెరుగుతుండటంతో అవసరమైన సుస్థిర అభివృద్ధి పనులకు ప్రభుత్వం వద్ద నిధులు ఉండటం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యం, రవాణా, తాగునీళ్లు, పారిశుద్ధ్యం, రోడ్లు వంటి కార్యకలాపాలను ప్రైవేటుపరం చేయాల్సి వస్తోంది. ఒకే పార్టీ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉంటే పరిస్థితి ఒకలా, లేకుంటే మరోలా ఉంటోంది. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగడం, వారు అధికారంలో ఉన్నప్పుడు, వచ్చే ఎన్నికల్లో అధికారంలో కొనసాగడానికి చేస్తున్న విచ్చలవిడి ఖర్చు ఆందోళన కలిగిస్తోంది. అభివృద్ధి పేరిట ఆదాయానికి మించి ఖర్చు చేయడం, సంక్షేమం పేరిట విపరీత రాయితీలు ఇవ్వడం, లోటు భర్తీ కోసం అప్పులు తీసుకోవడం వంటి పరిణామాలు పరిస్థితి చేయి దాటిపోతున్నట్టుగా అనిపిస్తున్నాయి.

పెరుగుతున్న మార్కెట్​ రుణాలు

అప్పులు తప్పు కాదు, కానీ అవి తలకు మించిన భారం కాకూడదు. అయితే ఈ ‘తలకు మించిన భారం’ అంచనా వేయడంలోనూ ఓ సమస్య దాగి ఉంది. అప్పు దేని కోసం చేస్తున్నారు? అప్పుతో చేపట్టిన పనులకు సుస్థిరత ఉందా? ఆయా పనులు లేదా కార్యకలాపాలు లేదా నిర్ణయాలు ప్రజాస్వామ్య బద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయా? చూడాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని అధికరణం 293 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో నిమిత్తం లేకుండా అప్పులు చేయవచ్చు. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రుణపడి ఉంటే, ఆర్టికల్ 293 క్లాజులు 3, 4 కింద, తాజా రుణాలకు  కేంద్రం సమ్మతి తీసుకోవాలి. కేంద్రానికి రాష్ట్రాలు రుణపడి ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ క్లాజు కింద అనుమతులకు షరతులు పెట్టే పరిస్థితి 2030 వరకు రాకపోవచ్చని14వ ఆర్థిక సంఘం తన రిపోర్ట్ లో చెప్పింది. వివిధ రకాల అప్పుల్లో, మార్కెట్ రుణాలు 2014-–15 లో 63.10 శాతం కాగా 2019–-20లో అవి  80.63 శాతానికి చేరుకున్నాయి. అంతకు ముందు 2006–-07లో మార్కెట్ రుణాలు 20 శాతం మాత్రమే. 

జీఎస్​డీపీ లెక్కలు

రుణాల వల్ల రాష్ట్ర అభివృద్ధిపై పడే ప్రభావాన్ని మదింపు చేసే ముఖ్యమైన ప్రక్రియల్లో మొదటిది ఆర్థిక నిర్వహణ తీరును అంచనా వేయడం. సాధారణంగా ద్రవ్యలోటు, రుణ పరిమాణం వంటి అంశాలపైన దృష్టి పెడతారు. వ్యయం నాణ్యత, ఆదాయ సమీకరణ ప్రయత్నాలు వంటి వాటిని పెద్దగా పరిగణించరు. ఒక రాష్ట్రం అభివృద్ధికి ఇవి కూడా చాలా ముఖ్యమైన అంశాలు. రుణ స్థిరత్వం, ఆర్థిక వివేకాన్ని కొలవాల్సిన అవసరం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, ఫైనాన్స్ కమిషన్, కాగ్ కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాల మార్కెట్ రుణాలపైన నిర్ధిష్టమైన కొలమానాలు తయారు చేయలేదు. 14వ ఆర్థిక సంఘం తన నివేదికలో రాష్ట్రాలు తీసుకునే రుణాలను కేంద్రప్రభుత్వం ఆర్టికల్ 293(3) కింద అనుమతిస్తూ అందులో పేర్కొన్న ఆర్థిక రోడ్ మ్యాప్ అమలు చేయాలని కోరింది. 4వ ఆర్థిక సంఘం తన అవార్డ్ కాలానికి (2015–-20), రాష్ట్రాల ద్రవ్యలోటు జీఎస్ డీపీలో ఏడాదిలో 3 శాతానికి మాత్రమే పరిమితమై ఉండాలని సిఫారసు చేసింది. ఆర్థిక క్రమశిక్షణను బట్టి కొన్ని ఆర్థిక వెసులుబాట్లు లభిస్తాయి. మొత్తానికి ఏ ఏడాదికైనా జీఎస్ డీపీలో ఒక రాష్ట్రానికి గరిష్టంగా 3.5 శాతం ద్రవ్యలోటు ఉండవచ్చు.  

బాండ్ల కొనుగోలుకు..

రాష్ట్రాల అభివృద్ధి రుణాలను బహిరంగ మార్కెట్ పెట్టుబడి సాధనాలకు అనుగుణంగా 2020లో సరళీకరించారు. ఇందులో బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా రాష్ట్ర అభివృద్ధి బాండ్ల కొనుగోలుతో సహా మునుపెన్నడూ లేని విధంగా లిక్విడిటీ చర్యలు తీసుకున్నారు. ఆర్​బీఐ రాష్ట్రాల అభివృద్ధి రుణాలను ప్రైవేటు కంపెనీ స్టాక్ తరహా అమ్మకాలు, కొనుగోళ్ల పద్ధతికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. బాండ్లకు సెకండరీ మార్కెట్​లో మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది అని ఆర్బీఐ భావిస్తున్నది. అదే జరిగితే, ఈ దారిన ఇంకా ముందుకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వాల జుట్టు పెట్టుబడిదారుల చేతిలో ఉంటుంది. ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఉండకపోవచ్చు. ఆర్థిక నియంత్రణకు చట్టాలు కూడా ఉన్నాయి. కేంద్రంలో ఎఫ్​ఆర్​బీఎం ఉండగా, రాష్ట్రాలు కూడా ఎఫ్​ఆర్​బీఎం చట్టాలు చేశాయి. 2003లో కేంద్ర ద్రవ్య వినిమయ చట్టం తీసుకు వచ్చారు. అప్పుల మీద పరిమితుల ద్వారా హేతుబద్ధ ద్రవ్య నిర్వహణ, ఆర్థిక సుస్థిరత, లోటు, ద్రవ్య కార్యకలాపాల్లో అధిక పారదర్శకత దీని ముఖ్య ఉద్దేశం. దీన్ని ఫైనాన్స్ యాక్ట్–2018 ద్వారా సవరించారు. ఈ చట్టం ప్రకారం 2024–-25 నాటికి ప్రభుత్వ రుణం జీడీపీలో 60 శాతం మించకుండా, ఇందులో కేంద్ర ప్రభుత్వం రుణాలు 40 శాతానికి మించరాదు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల అప్పులను నియంత్రించే అధికారం ఉందని అర్థం అవుతుంది.  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల రుణం జీడీపీలో 20 శాతం మించకుండా కృషి చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ 20 శాతం రాష్ట్రాల మధ్య విభజించడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఆమోదయోగ్యమైన ఆర్థిక సూత్రం లేదు. ఇక్కడే రాజకీయాలకు, రాజకీయ ఆరోపణలకు ఆస్కారం ఏర్పడుతోంది.

ఖర్చులో పారదర్శకత లేక..

మార్కెట్​లో రుణాలు తీసుకుని ప్రతి రుణానికి కడుతున్న వడ్డీ ఎంత అనేది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పడం లేదు. రుణం తీసుకుని పెట్టుబడి కింద వ్యయం చేస్తే భవిష్యత్తులో ఆదాయం రావచ్చు. లేదా ఖర్చు తగ్గవచ్చు. అయితే చాలా రాష్ట్రాలు అప్పులు చేసి, ఆస్తులు తనఖా పెట్టి అభివృద్ధి వ్యయం కింద సబ్సిడీల మీద ప్రజాకర్షక పథకాల మీద ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి, అధికారం నిలుపుకోవడానికి ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చు కూడా పారదర్శకంగా లేకపోవడంతో అవినీతి పెరిగిపోతున్నది. రాబోయే నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయాల్సి ఉండగా, వాటిని పట్టించుకోకుండా కార్పొరేషన్ల ద్వారా కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే ప్రాజెక్టుల మీద ఖర్చు చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. తెలంగాణాలో రూ.40 వేల కోట్ల భారీ మిషన్ భగీరథ పథకం ఈ కోవలోకి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆదాయం వచ్చే అవకాశాలు తక్కువ. మౌలిక సదుపాయాల కోసం అప్పులు తెస్తున్నా ప్రాజెక్ట్ రూపకల్పనలో ఇటువంటి లోపాలు శాపాలై అప్పుల భారాన్ని మిగిలిస్తున్నాయి. 

బడ్జెట్​పత్రాల్లో వివరాలేవి?

రాజ్యాంగ అధికరణాలు 293(3), (4)  కింద కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల రుణాలను నియంత్రించే అవకాశం ఉండగా ఈ కేంద్ర ద్రవ్య వినిమయ చట్టంలో కూడా అధికారం ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తేలాల్సి ఉంది. ఇంకొక వైపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1) ప్రకారం రాష్ట్ర శాసనసభలకు ప్రభుత్వం తీసుకునే రుణం మీద, ఇచ్చే గ్యారంటీల మీద పరిమితులు విధించే అధికారం ఉంటుంది. కాగా, 2010–11 నాటికి అన్ని రాష్ట్రాలు తమ స్థాయిలో ద్రవ్య వినిమయ చట్టాలు చేశాయి. ఈ చట్టాల ప్రధాన ఉద్దేశం ప్రత్యేక వార్షిక లక్ష్యాల ద్వారా రెవెన్యూ లోటును నిర్మూలించడం, ఆర్థిక లోటు జీఎస్​డీపీలో 3 శాతం దాటకుండా పరిమితి విధించడం. రాష్ట్రాల అప్పుల భారం తెలుసుకోవాలంటే బడ్జెట్​లో పేర్కొనని అదనంగా చేసిన అప్పులు, పద్దులో కనపడకుండా కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చే అప్పులు, కాంటిన్జెంట్​ లయబిలిటీస్ పరిగణనలోకి తీసుకోవాలి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆర్​బీఐ మాజీ అధికారి మాట్లాడుతూ ఆర్థిక నిర్వహణ, చెల్లింపులు బాగానే ఉన్నట్లు కనపడుతున్నా తెర వెనుక ఏమి జరుగుతున్నది తెలియడం లేదు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నది. రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి, ఖర్చు పెడుతున్నాయి. కానీ, గణాంకాలు, లెక్కలు ప్రజలకు తెలియనివ్వడం లేదు. శాసన సభలో ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ పుస్తకాల్లో చూపెట్టే ఆర్థిక సమాచారం తగ్గిస్తున్నారు. రాష్ట్రాలు చేసే అన్ని రకాల అప్పులను రాష్ట్ర బడ్జెట్ పుస్తకాల్లో కచ్చితంగా చూపెట్టాలనే నిబంధన 
తీసుకు రావాలి.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నిఘా ఏది?

కేంద్ర ప్రభుత్వ రుణాలను ఆర్​బీఐ చట్టబద్ధంగా నిర్వహిస్తోంది. రాష్ట్రాల విషయానికి వస్తే ఆర్​బీఐ రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం ద్వారా ప్రభుత్వ రుణాల నిర్వహణ చేపట్టవచ్చు. సిక్కిం మినహా అన్ని రాష్ట్రాలతో ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఇలాంటి ఒప్పందాలు ఇప్పటికే కుదుర్చుకున్నది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బాండ్లు, డిబెంచర్ల జారీ నిర్వహణ, వాటిని కొనసాగించడం, పూచీకత్తుల(సెక్యూరిటీల) లావాదేవీలకు ఏజెంట్​గా వ్యవహరించడానికి ఆర్​బీఐకి చట్టపర అధికారం ఉంది. రాష్ట్ర అభివృద్ధి రుణాలు అని పిలిచే రాష్ట్ర ప్రభుత్వాల మార్కెట్ రుణాలు, 2006–-07 నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన బాండ్లను ఆర్​బీఐ పూర్తిగా వేలం ద్వారానే నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేస్తే కేంద్ర సంస్థల నిఘా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే రాష్ట్ర స్థాయిలో ఆర్థిక అధ్యయన సంస్థలు లేవు. మార్కెట్ రుణాల మీద అంచనా కానీ, అధ్యయనం కానీ, నిఘా పెట్టే సంస్థలు లేవు. శాసన సభ కమిటీలు కూడా లేవు. మార్కెట్ రుణాల పరిమితుల మీద కేంద్ర ప్రభుత్వం కానీ, రాజ్యాంగ సంస్థల అధికారాల మీద చర్చ కొనసాగుతుండగా, రాష్ట్ర స్థాయిలో ఆర్థిక విశ్లేషణ సామర్థ్యం పెరగకపోవడం గమనార్హం. అప్పులు, పరిమితుల మీద చర్చకు తయారు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వ నాయకులు మార్కెట్ రుణాల పరిమితులు అధిగమించటానికి వేస్తున్న ఎత్తుగడలు అపరిమితంగా ఉన్నాయి. ప్రతి పనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆ కంపెనీకి గ్యారంటీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. ఇటువంటి అప్పుల మీద ఆర్​బీఐ కానీ, కాగ్​కానీ విమర్శనాత్మక వైఖరి అవలంబించినట్లు సమాచారం లేదు.

-దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్