సెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం
నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి లైన్ క్లియర్
మూడేళ్లకు రూ.1,517 కోట్లు కేటాయింపు
ఒక్కసారి టెస్ట్ రాస్తే మూడేళ్లపాటు వ్యాలిడిటీ
నచ్చిన భాషలో రాయొచ్చు
మూడు లెవెల్స్లో సెట్
117 జిల్లాలపై ప్రత్యేక దృష్టి.. మొదట వెయ్యి కేంద్రాలు
న్యూఢిల్లీ: రైల్వేలో జాబ్ కావాలంటే ఓ టెస్ట్.. బ్యాంకు జాబ్ కావాలంటే ఇంకో టెస్ట్.. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కు మరో టెస్ట్.. ఒకటా రెండా ప్రతి జాబ్కు సెపరేట్ గా పరీక్షలు రాయాల్సిన పరిస్థితి. ఒక్కోసారి అప్లై చేసుకున్న జాబ్లకు వేర్వేరుగా ఒకే రోజు టెస్ట్లు. అప్పుడు ఏ టెస్ట్ రాయాలో తేల్చుకోలేని పరిస్థితి. పైగా వాటి దరఖాస్తులకు అదనపు ఫీజులు. ఇకపై ఆ కష్టాలేవీ ఉండవు. ఒక అర్హతకు సంబంధించి ఏ జాబ్ అయినాసరే ఒక టెస్ట్ రాస్తే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు(నాన్టెక్నికల్) ఒకటే కామన్ ఎలిజబిలిటీ టెస్ట్(సెట్– సీఈటీ)కి కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. సెట్ నిర్వహణకు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) ఏర్పాటుకూ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భేటీ అయిన కేబినెట్.. ఎన్ఆర్ఏకి లైన్ క్లియర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నియామకాల్లో సంస్కరణలకు బాటలు వేసింది. ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ ఉండే ఎన్ఆర్ఏకి మూడేళ్లకు గానూ రూ.1,517.57 కోట్లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. సెక్రటరీ స్థాయి అధికారి ఏజెన్సీకి చైర్ పర్సన్ గా ఉంటారు.
ఒక్కసారి రాస్తే.. మూడేళ్ల వ్యాలిడిటీ
నాన్ టెక్నికల్ గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టులన్నింటినీ ఎన్ఆర్ఏ ద్వారానే భర్తీ చేయనున్నారు. అందులో రైల్వే శాఖ, ఆర్థికశాఖ ప్రతినిధులతో పాటు రిక్రూట్మెంట్ బోర్డులైన ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ కు చెందిన రిప్రజెంటేటివ్లూ ఏజెన్సీలో సభ్యులుగా ఉంటారు. అరత్హను బట్టి అన్ని జాబ్లకు ఒక సెట్ రాస్తే సరిపోతుంది. అందుకు 3 లెవెల్స్లో సెట్ను పెడతారు. డిగ్రీ, ఇంటర్, టెన్త్ స్టాండర్డ్ స్థాయిలో పరీక్ష పెడతారు. సెట్లో స్కోర్ ఆధారంగా వివిధ రిక్రూట్మెంట్ బోర్డులు అరత్హను బట్టి ఫైనల్ సెలెక్షన్కు టయర్ 2, టయర్3 స్పెషలైజ్డ్ ఎగ్జామ్ను నిర్వహిస్తాయి. ఒక్కసారి సెట్ రాస్తే మూడేళ్లపాటు ఆ స్కోర్ను లెక్కలోకి తీసుకుంటారు. అప్పర్ ఏజ్ లిమిట్ లోపు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. అటెంప్ట్ పై ఎలాంటి ఆంక్షలూ పెట్టలేదు. వయసు దాటిపోతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఏజ్ రిలాక్సేషన్ను ఇస్తారు. మనకు నచ్చిన భాషలో సెట్ను రాసుకునేలా కేంద్ర కేబినెట్ వీలు కల్పించింది. దీనివల్ల ఇటు అభ్యర్థులకు అటు రిక్రూట్మెంట్ బోర్డులకు ఖర్చుతో పాటు శ్రమ తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. సెట్ స్కోర్
ఆధారంగానే రిక్రూట్మెంట్ చేస్తామని ఇప్పటికే కొన్ని డిపార్ట్ మెంట్లు ప్రకటించాయి.
పీపీపీ పద్ధతిలో ఎయిర్ పోర్టులు
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో జైపూర్, గువాహాటీ, తిరువనంతపురం ఎయిర్ పోర్టులను లీజుకిచ్చేందుకూ కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఇప్పటికే లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి ఎయిర్పోర్టులను రన్ చేసేందుకు అదానీ ఎంటర్ ప్రైజెస్ హక్కులను పొందింది. పోయినేడాది ఫిబ్రవరిలో బిడ్డింగ్ ను దక్కించుకుంది. వాటిలో అహ్మదాబాద్, మంగళూరు, లక్నో ఎయిర్ పోర్టులిచ్చేందుకు నిరుడు జులైలోనే కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధీనంలోనే ఉన్న వాటి ఆపరేషన్స్కు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 14న అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఆగస్టు 12న వాటిని అదానీ గ్రూప్ టేకోవర్ చేయాల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా ఆ గడువును మరో 3నెలలు పెంచింది ఏఏఐ. డిస్కంలకు వర్కింగ్ క్యాపిటల్ పై వన్ టైమ్ రిలాక్సేషన్ ను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన (ఉదయ్) స్కీమ్లో కేంద్రం రూ.90 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 25 శాతం వర్కింగ్ క్యాపిటల్ లిమిట్పైనే లోన్లు ఇస్తున్నామని, కరోనా పరిస్థితుల నేపథ్యంలో డిస్కంలకు బిల్లులు సరిగ్గా వసూలు కాకపోతుండడంతో ఆ లిమిట్పై ఉపశమనం కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు.
చెరుకు ధర 10% పెంపు
చెరుకు రైతులకు ఊరట కలిగిస్తూ క్వింటాల్ చెరుకుపై ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ (ఎఫ్ఆర్పీ)ని కేంద్రం 10% పెంచిం ది. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్స్ట్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) సిఫార్సుల ప్రకారం క్వింటాల్ చెరుకుపై 285 రూపాయలను పెంచింది. 2020–21 సీజన్కు సంబంధించి చక్కెర మిల్లులు రైతులకు కేంద్రం పెట్టిన ధరనే చెల్లించాలని సూచించింది.
ఉండే ఊరికి దగ్గర్లోనే పరీక్ష రాసుకోవచ్చు
సెంటర్లలో పరీక్ష రాసేందుకు ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి క్యాండిడేట్లు వస్తుంటారు. వాళ్లకు ఆ తిప్పలను తప్పించేందుకు వాళ్లు ఉండే ఊరికి దగ్గర్లోనే పరీక్ష రాసుకునే వీలు కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందుకు తగ్గట్టు అన్ని జిల్లాల్లోనూ పరీక్ష కేంద్రాల కోసం మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకించి 117 ఆస్పిరేషన్ డిస్ట్రిక్స్లపై స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. దీని వల్ల గ్రామీణ అభ్యర్థులకు మేలు జరుగనుంది. ప్రయాణ ఖర్చులు, శ్రమ, సేఫ్టీ ఉంటుందని కేంద్ర సర్కార్ అనుకుంటోంది. అంతేగాకుండా పరీక్షా కేంద్రాలు దగ్గరగా ఉంటే గ్రామీణ ప్రాంతాల యువత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై మరింత ఆసక్తి చూపిస్తారని ఆశిస్తోంది. ఇందులో భాగంగా మొదట వెయ్యి ఎగ్జామినేషన్ సెంటర్లను పెడతామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
యువతకు ఎన్ఆర్ఏ వరం: మోడీ
నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అన్నది కోట్లాది మంది యువతకు ఓ వరం అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. దీనితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎన్నెన్నో ఎగ్జాములు రాసే బెడద తప్పుతుందన్నారు. పేద క్యాండిడేట్లకు డబ్బు, సమయం ఆదా అవుతాయన్నారు. పరీక్షల్లో పారదర్శకత కూడా పెరుగుతుందని చెప్పారు. ఎన్ఆర్ఏకి కేబినెట్ ఆమోదం చెప్పిన తర్వాత ఆయన దానిపై ట్వీట్ చేశారు. ఎందరో నిరుద్యోగులకు ఇది లాభం చేస్తుందని, ఎన్ఆర్ఏ చరిత్రాత్మక నిర్ణయం అని సమాచారప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.
For More News..