తమ ఆటతో లక్షలాదిమందికి రోల్ మోడల్స్‌గా నిలుస్తున్న క్రీడాకారులు పొగాకు, మద్యం వంటి సర్రోగేట్ ప్రకటనల్లో కనిపించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం.. బీసీసీఐ, సాయ్‌ని కోరింది. ఈ మేరకు ఆయా క్రీడా సంస్థలకు పలు సూచనలు చేసింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సాయ్ డీజీ సందీప్ ప్రధాన్‌లకు గురువారం రాసిన లేఖలో ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్‌ఎస్) డాక్టర్ అతుల్ గోయెల్ పలు సూచనలు చేశారు.
"దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువతకు క్రీడాకారులు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి క్రికెటర్లు, క్రీడాకారులు యాడ్స్‌లో కనిపించడం వల్ల యువతపై దుష్ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. సంబంధిత అంశంపై బీసీసీఐ దృష్టిసారించాలని కోరుతున్నాం. ఇలాంటి ప్రకటనల్లో క్రీడాకారులు పాల్గొనకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా బీసీసీఐ నిర్వహించే మ్యాచ్‌లు, ఐపీఎల్ టోర్నీ సమయంలో క్రికెటర్లు మాత్రమే కాదు.. ఇతర ప్రముఖులు ఎవరూ పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ ప్రకటనలను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలి.." అని అతుల్ గోయెల్ పేర్కొన్నారు.
ప్రత్యేకించి క్రికెటర్లు యువకులకు ఆదర్శప్రాయులని డీజీహెచ్‌ఎస్ జనరల్ అన్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, ఉత్పాదక జీవనశైలిని ప్రోత్సహించాలని ఆయన కోరారు.
మరణాలలో రెండవ స్థానం
కాగా, ప్రపంచవ్యాప్తంగా పొగాకు సంబంధిత మరణాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది, ప్రతి సంవత్సరం దాదాపు 13.5 లక్షల నివారించదగిన మరణాలు నమోదవుతున్నాయి. అలాగే, పొగాకు సంబంధిత క్యాన్సర్ దేశంలోని మొత్తం క్యాన్సర్ కేసులలో 33 శాతంగా ఉంది. ఇందులో పురుషులలో దాదాపు 50 శాతం ఉండగా.. స్త్రీలు 17 శాతంగా ఉన్నారు.
భారతదేశంలో పొగాకు వినియోగాన్ని ప్రారంభించే వయస్సు ఏడేళ్లలోపే ఉందని వివిధ సర్వేలు గుర్తించాయని గోయల్ లేఖలో పేర్కొన్నారు.