600 బ్రాంచీల మూత?

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెందిన సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా 13 శాతం బ్రాంచీలను మూసివేయనుంది. ఆర్థికంగా బలపడేందుకు 600 బ్రాంచీలను మూసేయాలని బ్యాంకు నిర్ణయించింది. నష్టాలతో నడిచే కొన్ని బ్రాంచీలను ఇతర బ్రాంచీలలో విలీనం చేయనుంది. ఈ బ్రాంచీల మూసివేతను మార్చి 2023 నాటికల్లా పూర్తి చేయాలని సెంట్రల్​బ్యాంకు టార్గెట్​గా పెట్టుకున్నట్లు రాయిటర్స్​ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది. ఆర్థికంగా పటిష్టంగా మారే దిశలో నాన్​–కోర్​ అసెట్లను కూడా ఈ బ్యాంకు తర్వాత దశలో అమ్మనున్నట్లు సీనియర్​ గవర్నమెంట్​ ఆఫీసర్​ ఒకరు వెల్లడించారు. 100 ఏళ్లుగా నడుస్తున్న ఈ బ్యాంకుకు మొత్తం 4,594 బ్రాంచీలున్నాయి. 2017లో మరికొన్ని ఇతర ప్రభుత్వ బ్యాంకులతో కలిపి,  సెంట్రల్​ బ్యాంకును ప్రాంప్ట్​​ కరెక్టివ్​ యాక్షన్​ (పీసీఏ) కిందకు ఆర్​బీఐ తీసుకు వచ్చింది. ఇతర బ్యాంకులన్నీ ఆర్థికంగా మెరుగుదలతో పీసీఏ నుంచి బయటపడినా, సెంట్రల్​ బ్యాంకు మాత్రం బయటపడలేకపోతోంది. ఉద్యోగులను సక్రమంగా వినియోగించుకోలేక, లాభాల బాటలోకి రాలేకపోతున్నట్లు సెంట్రల్​ బ్యాంకు తన బ్రాంచీలకు పంపిన ఒక లెటర్​లో పేర్కొంది. ఈ నెల 4 వ తేదీన ఈ లెటర్​ను పంపించారు. డిసెంబర్​ 2021 క్వార్టర్లో సెంట్రల్​ బ్యాంకు రూ. 282 కోట్ల లాభం ఆర్జించింది. కానీ, ఈ బ్యాంకు ఎన్​పీఏలు 15.16 శాతంగా ఉన్నాయి. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎన్​పీఏల శాతం చాలా ఎక్కువగా నమోదవుతోంది.