నిజామాబాద్, వెలుగు : భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా కేంద్రం మూడు బిల్లులు తయారుచేసిందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. దీనిని జర్నలిస్టులంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మీడియా వ్యవస్థ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీం కోర్టు రిటైర్డ్జడ్జితో కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. ఐజేయూ, ఇండియన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అందించే ఈ నివేదికను బిల్లుగా మార్చి చట్టం తేవాలని కోరతామన్నారు.
‘ప్రజాస్వామ్యం– మీడియా’ అనే అంశంపై టీయూడబ్ల్యూజే, ఐజేయూ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజల పక్షాన పనిచేసే మీడియా పారదర్శకత, విలువలు పాటించాలని సూచించారు. పాలక ప్రభుత్వాల తీరుతో సమాజంలో జర్నలిస్టులకు విలువ తగ్గుతోందన్నారు. పత్రికా స్వేచ్ఛ ప్రపంచంలో 159 స్థానానికి ఆందోళన కలిగిస్తోందన్నారు. సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, రచయిత నందిని సిధారెడ్డి మాట్లాడుతూ పక్షపాతం లేని జర్నలిజం అన్ని తరాలకు అవసరమని చెప్పారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, స్టేట్కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, టీయూడబ్ల్యూజే, ఐజేయూ జిల్లా ప్రెసిడెంట్ ఎడ్ల సంజీవ్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు చింతల గంగాదాస్, బొబ్బిలి నర్సయ్య పాల్గొన్నారు.