గ్రీన్‌ గ్రోత్‌కు కేంద్ర బడ్జెట్‌ భరోసా : చిట్టెడ్డి ​ కృష్ణా రెడ్డి

కొత్త భారత ఆర్థిక వ్యవస్థను నిర్మించే క్రమంలో అవసరమైన పర్యావరణ సమతుల్యాన్ని సాధించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న ఏడు ముఖ్యమైన భాగాల్లో గ్రీన్ గ్రోత్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బలమైన, స్థిరమైన, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడానికి అవసరమైన నిర్మాణాత్మక సంస్కరణల్లో గ్రీన్ గ్రోత్ విధానాలు అంతర్భాగంగా ఉన్నాయి. ఆర్థిక ప్రగతికి ప్రధాన కొలమానంగా జీడీపీ దాని వృద్ధిరేటును పరిగణలోకి తీసుకొని కొలవడం మాత్రమే జరుగుతుంది. కానీసాధించిన వృద్ధిరేటు, దీర్ఘకాల ప్రయోజనాల తాకట్టుతో వచ్చిందా లేదా భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమతుల్యతను సాధించిందా అనేది ముఖ్యమైంది. అయితే ఈసారి మనదేశం ఈ బడ్జెట్లో గ్రీన్‌ బడ్జెట్‌కు అధిక ప్రాధాన్యతను ఇచ్చి దుష్ప్రభావాల బారి నుంచి దేశంతో పాటు ప్రపంచ దేశాలను కార్యోన్ముఖులను చేయడానికి కృషి చేయడానికి సంకల్పిస్తోంది. పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలు, బలమైన- స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు దోహదపడే విధంగా హరిత వృద్ధిని సాధించాల్సిన అవసరం నేడు ప్రపంచంలోని అన్ని దేశాలకు ఉంది.

దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఆర్థికంగా కొంత పురోగతి సాధించినా పర్యావరణ అసమర్థతో అనేక దుష్పరిణామాలు ప్రతిరోజు ప్రజలు ఎదుర్కొంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యావరణ సమస్యలతో అతలాకుతలం అవుతుండటమే దీనికి నిదర్శనం. స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు ప్రస్తుతం ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో ఎయిర్ ఫిల్టర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. క్లైమేట్‌లో వచ్చిన తీవ్రమైన మార్పులతో ఆరోగ్య సమస్యలు, ఉష్ణోగ్రతలో తీవ్రమైన హెచ్చుతగ్గులు లాంటి ప్రధాన సమస్యలు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ మార్పులు ప్రజల పై ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల పైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించే విధంగా కృషి చేయాలని ప్రపంచ దేశాలన్నీ కోరుకుంటున్నాయి. 

భారీ ఎలక్ట్రిసిటీ వినియోగం..

ప్రపంచ ఆర్థిక,  సుస్థిరత ప్రాధాన్యతలలో మనదేశం తన పాత్రను బలోపేతం చేయడానికి జీ20 దేశాల నాయకత్వం ఒక అవకాశం. ప్రస్తుత మోడ్రన్‌ టెక్నాలజీ సమాచార విప్లవంతో మానవ మనుగడకు సరికొత్త సమస్యలను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలు ఎదుర్కోవాలంటే గ్రీన్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ అత్యంత కీలకమైనవి. మూడు భాగాలుగా ఉన్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) డిజిటల్, ఇంటర్నెట్ డిజిటల్, సెక్టోరల్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ. ఇంటర్నెట్ డిజిటల్ ఎకానమీ, సెక్టోరల్ డిజిటల్ ఎకానమీ అనే రెండు భాగాలు ఇప్పటికీ ప్రపంచ సగటుతో పోలిస్తే జీడీపీలో చాలా తక్కువ వాటాను కలిగి ఉన్నాయి. ఈ రెండు భాగాలు తక్కువ పర్యావరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఐసీటీ అభివృద్ధితో వాటి  ప్రభావం, ఎలక్ట్రానిక్ అప్లికేషన్‌ల ప్రభావాలు, ఈకామర్స్ ప్రభావాలు, డిజిటల్ వ్యవస్థతో  ఆర్థిక వ్యవస్థలో  ఎనర్జీ ప్రాధాన్యత ఎంతగానో పెరిగిపోయింది. ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా ప్రకారం మనదేశం తన ఇంధన వ్యవస్థను ప్రపంచ వాతావరణ లక్ష్యాలతో సమీకృతం చేయడానికి రాబోయే దశాబ్దాల్లో $1.4 ట్రిలియన్ల అదనపు పెట్టుబడి అవసరం. రాబోయే 40 ఏళ్లలో దేశ జనాభా అంచనా ప్రకారం 1.8 బిలియన్లకు చేరుకుంటుంది. ఆర్థిక వ్యవస్థ కూడా మరింత వేగంగా వృద్ధి చెందుతుంది కనుక, దేశంలోని అన్ని రంగాలకూ అవసరమైన ఎనర్జీ డిమాండ్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ వినియోగం భారీగా అవసరం ఉండబోతుంది. 

గ్రీన్‌ మొబిలిటీకి పెద్ద పీట..

సుస్థిరతను ప్రోత్సహించడానికి, ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మొబిలిటీకి మారడాన్ని ప్రోత్సహించడానికి, ఈవీలలో ఉపయోగించే బ్యాటరీల కోసం లిథియం -అయాన్ సెల్‌ల తయారీకి అవసరమైన మూలధన వస్తువులు, యంత్రాల దిగుమతికి కస్టమ్స్ సుంకం మినహాయింపు పొడిగించారు. ఇది దేశీయ పరిశ్రమకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తూ వాటిని మరింత పోటీగా మారుస్తుంది. పర్యావరణ పరిరక్షణ చట్టంలో గ్రీన్ క్రెడిట్‌ను చేర్చడం భారత ఆర్థిక వ్యవస్థను డీకార్బనైజ్ చేయడంలో చాలా ఉపయోగపడతాయి. ఇది మనదేశాన్ని గ్రీన్ మొబిలిటీకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లడానికి,2030కి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి తోడ్పడుతుంది. గ్రీన్ గ్రోత్  జరిగితే కార్బన్ తీవ్రత తగ్గుతుంది,  గ్రీన్ ఉద్యోగాలు క్రియేట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అంతిమ లక్ష్యం నాన్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్‌పుట్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ సోలార్ రంగంలో దేశం సాంకేతికత మార్కెట్ నాయకత్వాన్ని చేపట్టేలా చేయడం. 

బ్యాటరీల ధరల్లో తగ్గింపు.. నాణ్యతలో పెంపు..

కాలం చెల్లిన వాహనాల ప్లేస్‌లో కొత్త వాహనాలు వస్తే పర్యావరణ సమస్యను పరిష్కరించవచ్చు. కాలుష్య రహిత వాహనాల వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ గ్రీన్ బడ్జెట్ ప్రాధాన్యత పెంచాలంటే  బ్యాటరీల ధరలు తక్కువగా ఉండి, సైజు తగ్గించి నాణ్యత రేటు పెంచాలి. వాటిని రీఛార్జ్ చేసుకోవడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అత్యంత వేగంగా నిర్మించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైన ఉంది. ఈ సదుపాయాలు విరివిగా గ్రామీణాల నుంచి పట్టణాల స్థాయికి అందుబాటులోకి రావాలి.  రాష్ట్రాలకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేలా ఆయా రాష్ట్రాల బడ్జెట్లో కేటాయింపులు జరిపి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తే ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి.

అన్ని దేశాలూ నడుం కట్టాలి..

సరికొత్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు నాంది పలుకుతున్న టైంలో వాటి ద్వారా ఏర్పడే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడం అతిపెద్ద సవాల్ అనే చెప్పవచ్చు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ఒక రాష్ట్రం, ఒక దేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా నడుం కట్టాల్సిన అవసరం ఉంది. మనదేశం గ్రీన్ ఎనర్జీకి ఇచ్చే ప్రాధాన్యత ప్రపంచ దేశాలన్నీ కూడా అనుసరించే అవకాశం ఉంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అంశం కనుక నేడు మనదేశ కేంద్ర బడ్జెట్లో  గ్రీన్ బడ్జెట్ కు సంబంధించిన అంశాలకు అత్యధిక ప్రాధాన్యతను కల్పించడం ఎంతో అభినందించ దగిన విషయం.

గ్రీన్‌ క్రెడిట్‌ ద్వారా..

కేంద్ర బడ్జెట్- 2023  ప్రగతిశీలమైంది, ఇంధన రంగానికి ప్రయోజనకరంగా ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గ్రీన్‌ ఇండస్ట్రీ, ఆర్థిక పరివర్తనకు నాంది పలికేందుకు 2070 నాటికి ‘పంచామృతం’ (ప్రధానమంత్రి నిర్దేశించిన ఐదు వాతావరణ కార్యాచరణ లక్ష్యాలు) నికర-శూన్య కర్బన ఉద్గారాల కోసం మనదేశం దృఢంగా ముందుకు సాగుతోందని, ఈ బడ్జెట్ హరిత వృద్ధిపై దృష్టి సారిస్తుందని చెప్పారు. గ్రీన్ గ్రోత్‌పై ప్రకటన అత్యంత సమగ్రమైంది. గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు రూ. 19,700 కోట్లు ఖర్చవుతుంది. ఇది నిస్సందేహంగా శక్తి పరివర్తనను వేగవంతం చేస్తుంది. లడఖ్ గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ను ప్రోత్సహించడం స్వాగతించదగిన చర్య. నికర సున్నా లక్ష్యాన్ని చేరుకోవడానికి రూ. 35,000 కోట్ల మూలధన పెట్టుబడిని అభినందించదగిన విషయం. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా బ్యాటరీ శక్తిని నిల్వ చేయడం, పునరుత్పాదక ఇంధన తరలింపు, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాల ద్వారా ఇంధన పరివర్తన హారిజోన్‌ను విస్తరించారు. 

– చిట్టెడ్డి ​ కృష్ణా రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ