ముషీరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్ అబద్ధాల పుట్ట అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. కార్పొరేట్లకు రూ.25 లక్షల కోట్ల రుణాలు మాఫీచేసి పేదల కోసం విద్య, వైద్య రంగాలకు నిధులు కేటాయించకుండా ప్రజా బడ్జెట్ అని అబద్ధాలు చెప్పారని ఆయన మండిపడ్డారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ దినోత్సవాన్ని పురస్కరించుకొని దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రక్షించాలి, పట్టణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టాలి’ అన్న డిమాండ్‌తో రాష్ట్ర సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో గత సంవత్సరం కేంద్రం రూ.89 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం రూ.86 వేల కోట్లు కేటాయించి 26 శాతం నిధులు పెంచామని అబద్ధం చెబుతోందని ఫైర్ అయ్యారు. ఆన్ లైన్ హాజరు, ఆధార్ బేస్డ్ పేమెంట్ విధానం తీసుకువస్తూ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తి వేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మానవ హక్కుల వేదిక జాతీయ సమన్వయకర్త జీవన్ కుమార్ మాట్లాడుతూ దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు. ఉపాధి హామీ పరిశోధకుడు చక్రధర్ బుద్ధ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.