కార్పొరేట్ సంస్థల కోసమే కేంద్ర బడ్జెట్

కార్పొరేట్ సంస్థల కోసమే కేంద్ర బడ్జెట్
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపణ
  • వైద్యం, విద్య, శ్రామిక, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రానికి మొండిచేయి
  •  తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ 

చౌటుప్పల్, వెలుగు : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ శ్రామికవర్గాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. వైద్యం, విద్య, శ్రామిక, వ్యవసాయ రంగాల్లో బడ్జెట్ లో రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపించిందని విమర్శించారు.  మంగళవారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లోని సీపీఎం ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ శక్తులే మోదీ ప్రభుత్వాన్ని కాపాడుతున్నాయని మండిపడ్డారు. 

రాష్ట్ర బీజేపీ ఎంపీలు తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడనప్పుడు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయడంలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే బడ్జెట్ లోనైనా హామీలు అమలు పరిచేలా ఉండాలని, లేదంటే ప్రజల పక్షాన పోరాడుతున్నామని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై తొలిసారి రావడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.  ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు ఎండీ జహంగీర్, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.