వరద నష్టం పరిశీలనకు రాష్ట్రానికి కేంద్ర బృందం

వరద నష్టం పరిశీలనకు రాష్ట్రానికి కేంద్ర బృందం

రాష్ట్రంలో వరద వల్ల జరిగిన నష్టం ఎంత.. ఎన్ని ఎకరాల్లో పంట దెబ్బతిన్నదన్న విషయాలపై అంచనా వేసేందుకు కేంద్ర బృందం గురువారం రాష్ట్రానికి వస్తోంది. వాన నష్టం అంచనా కోసం కేంద్ర హోంశాఖ ఐదుగురు సభ్యులతో కమిటీ నియమించింది. హైదరాబాద్ ముంపు ప్రాంతాలు సహా తెలంగాణలో పంట నష్టాన్ని కేంద్రానికి రిపోర్ట్ చేయనుంది సెంట్రల్ కమిటీ. హైదరాబాద్ సహా జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించనుంది. ఇళ్ల మునక, ఆస్తి నష్టం, పంట నష్టం, రహదారుల నష్టాన్ని కేంద్ర బృందం అంచనావేస్తుంది. ఇప్పటికే వరద సాయంకింద రూ.1350కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు. సెంట్రల్ టీమ్.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసి.. కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ కమిటీ పర్యటన గురించి చెప్పారు. జలవనరులు, ఆర్థికశాఖ, రోడ్డు రవాణా శాఖల అధికారులతో కలిపి కమిటీని నియమించినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు కిషన్ రెడ్డి. వరదను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉందన్నారు. ధనిక రాష్ట్రం కాబట్టి ప్రస్తుతానికి అత్యవసర నిధులను వాడుకోవాలని చెప్పామన్నారు. కమిటీ నివేదిక అందిన తర్వాత.. కేంద్రం సహాయం చేస్తుందన్నారు. అధికారులు ముందే అలర్ట్ చేసి ఉంటే ఇంత నష్టం ఉండేది కాదన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చాక పంట నష్టంపై వంద శాతం పరిహారం ఇస్తోందన్నారు.