టెన్త్‌తో కేంద్ర సాయుధ దళాల్లో 39,481 కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి ఇటీవలే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మూడు నెలల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగులోనూ ఎగ్జామ్ రాసుకోవచ్చు. కంప్యూట ర్ బేస్డ్, ఫిజికల్, మెడికల్ టెస్టులతో ఎంపిక చేస్తారు. వీరిని శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే సుమారు రూ.40,000 వేతనం అందుకోవచ్చు. జనవరి లేదా ఫిబ్రవరిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎలా ప్రిపరేషన్ కొనసాగించాలో తెలుసుకుందాం..
ఎస్‌ఎస్‌సీ దాదాపు ఏటా సాయుధ దళాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేస్తోంది. పదో తరగతి విద్యార్హతతో, జనరల్ అభ్యర్థులు 23 ఏళ్ల వయసు వరకు పోటీపడవచ్చు. అందువల్ల వీటిని లక్ష్యంగా చేసుకున్నవారు విజయం సాధించడానికి అవకాశాలెక్కువ. ఆసక్తి, మెరిట్ ప్రకారం అభ్యర్థులు.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎఫ్‌ఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్), నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)లో ఏదైనా ఎంచుకోవచ్చు.
ఎన్‌సీబీకి లెవెల్-1 బేసిక్ జీతం రూ.18,000 దక్కుతుంది. వీరు అన్నీ కలిపి రూ.35,000 పొందొచ్చు. మిగిలిన విభాగాల్లో లెవెల్-3 మూలవేతనం రూ.21,700 పొందుతారు. దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలూ దక్కుతాయి. తొలి నెల నుంచే సుమారు రూ.40 వేల జీతం అందుకోవచ్చు. అనుభవంతో హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై స్థాయికి చేరుకోవచ్చు. విధుల్లో ప్రతిభ, విద్యార్హతలు, శాఖాపరమైన పరీక్షలతో ఎస్సై, ఆపై స్థాయిలో సేవలు అందించవచ్చు.
ఎగ్జామ్ ప్యాటర్న్: 80 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 చొప్పున 160 మార్కులకు దీన్ని నిర్వహిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్/హిందీ ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. వీటికి గంటలో సమాధానాలు గుర్తించాలి. పరీక్ష మాధ్యమంగా తెలుగు, ఇంగ్లీష్ లేదా ఏదైనా భాషను ఎంచుకోవచ్చు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో పదో తరగతి సిలబస్ స్థాయిలోనే ఉంటాయి. తప్పు జవాబుకు పావు మార్కు తగ్గిస్తారు. పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్ అభ్యర్థులు 30, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌లు 25, ఎస్సీ, ఎస్టీలు 20 శాతం మార్కులు పొందాలి. ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్‌కు 5, బీ ఉంటే 3, ఏ ఉన్నవారికి 2 శాతం మార్కులు కలుపుతారు. ఇలా అర్హత మార్కులు పొందినవారి జాబితా నుంచి రాష్ట్రాలు, విభాగాల వారీ మొత్తం ఖాళీలకు 8 రెట్ల సంఖ్యలో అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు.
పీఈటీ, పీఎస్‌టీ: పీఈటీలో భాగంగా పురుషులు 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాల్లో, మహిళలు 1.6 కి.మీ. దూరాన్ని 8–1/2 నిమిషాల్లో చేరుకోవాలి. పీఎస్‌టీలో.. పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీ పురుషులు 162.5, మహిళలు 150 సెం.మీ. ఉంటే సరిపోతుంది. పురుషుల ఛాతీ విస్తీర్ణం 80 సెం.మీ. (ఎస్టీలకు 76) తప్పనిసరి. ఊపిరి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ.పెరగాలి.
ఎత్తుకు తగ్గ బరువుండాలి. అన్ని విభాగాల్లోనూ అర్హులైనవారి జాబితా నుంచి పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం కేటగిరీలవారీ ఖాళీలకు 2 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెడికల్ టెస్టుకు అవకాశమిస్తారు. అందులోనూ విజయవంతం కావాలి. తుది నియామకాలు పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్, రాష్ట్రాలు, విభాగాల వారీ ఖాళీలు, రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు నింపినప్పుడే సర్వీసులవారీ ప్రాధాన్యం తెలపాలి. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు కానిస్టేబుల్ హోదాతో సేవలందిస్తారు.
సిలబస్
ఎలిమెంటరీ మ్యాథ్స్: అంకెల మధ్య సంబంధం, శాతాలు, సగటు, భిన్నాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వడ్డీ, డిస్కౌంట్, కొలతలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ దాదాపు హైస్కూల్ మ్యాథ్స్ పుస్తకాల్లోనివే. గణిత పుస్తకాలు బాగా చదివి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే గరిష్ట మార్కులు పొందవచ్చు.
ఇంగ్లీష్: అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థకాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్.. విభాగాల నుంచే వీటిని అడుగుతారు. హైస్కూల్ స్థాయి ఇంగ్లీష్ బుక్స్‌లోని గ్రామర్ చదువుకుంటే ఎక్కువ స్కోర్ చేయవచ్చు.
జనరల్ ఇంటెలిజన్స్ అండ్ రీజనింగ్: నంబర్ ఎనాలజీ, పోలికలు, తేడాలు, నంబర్ సిరీస్, కోడింగ్ - డీకోడింగ్, పరిశీలనలు, సంబంధాలు నంబర్ క్లాసిఫికేషన్, ఫిగర్ ఎనాలజీ, వర్డ్ బిల్డింగ్..మొదలైన విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధిస్తే ఎక్కువ సమాధానాలు గుర్తించవచ్చు. తర్కంతో ముడిపడే తేలిక ప్రశ్నలే ఉంటాయి.
జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్: ఈ విభాగంలోని ప్రశ్నలకు సాధారణ పరిజ్ఞానంతోనే జవాబులు గుర్తించగలరు. దైనందిన జీవితంతో ముడిపడే ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం. కరెంట్ అఫైర్స్ ప్రశ్నలుగా వస్తాయి. వీటితోపాటు భారత్ - పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్ అంశాల నుంచీ ప్రశ్నలు అడుగుతారు. హైస్కూల్ సోషల్, సైన్స్ పాఠ్యపుస్తకాలు బాగా చదివినవారు ఎక్కువ మార్కులు పొందగలరు. వర్తమాన వ్యవహారాల ప్రశ్నలు ఎదుర్కోవడానికి జనవరి 2024 నుంచి ముఖ్యాంశాలు గుర్తుంచుకోవాలి.
ప్రిపరేషన్ స్ట్రాటజీ: మొదటగా సిలబస్ పూర్తిగా చదవాలి. మాక్ టెస్టులు, ప్రీవియస్ పేపర్స్ వీలైనన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. దీంతో ప్రశ్నల స్థాయి తెలుస్తుంది. పరీక్షలో 60 నిమిషాల వ్యవధిలో 80 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. అంటే ప్రతి ప్రశ్నకు 45 సెకన్ల టైమ్ ఉంటుంది. అందువల్ల తక్కువ వ్యవధిలో వీలైనన్ని సరైన సమాధానాలు గుర్తిస్తేనే విజయం సాధించగలరు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో జవాబు కోసం ఎక్కువ సమయం పడుతుంది. పరీక్షకు ముందు వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో మాదిరి ప్రశ్నలు సాధన చేయడం, సూత్రాలు ఉపయోగించే విధానం, షార్ట్ కట్ మెథడ్స్‌పై పట్టు సాధిస్తే తక్కువ వ్యవధిలో జవాబు గుర్తించగలుగుతారు.
పరీక్షకు ముందు కనీసం 20 మాక్ టెస్టులు రాయాలి. వాటి ఫలితాలను సమీక్షించుకుని, తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియనివాటిని వదిలేయాలి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్.. అగ్నివీర్ పరీక్షల ప్రశ్నపత్రాలూ అధ్యయనంలో ఉపయోగమే. పరీక్షకు ముందు ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉంచిన మాక్ టెస్టునూ రాయాలి. ఇప్పటి నుంచీ పరీక్ష మీదే దృష్టి సారించాలి. పరీక్ష తర్వాత ఫిజికల్ టెస్టుల్లో ఉత్తీర్ణతకు సాధన చేయవచ్చు.